మేం మొదట భారతీయులం.. ఆ తర్వాతే తెలంగాణ బిడ్డలం | KTR Support To Protests Against Vizag Steel Plant Privatization | Sakshi
Sakshi News home page

మేం మొదట భారతీయులం.. ఆ తర్వాతే తెలంగాణ బిడ్డలం‌

Mar 13 2021 4:17 AM | Updated on Mar 13 2021 8:10 AM

Ktr Support To Protests Against Vizag Steel Plant Privatization - Sakshi

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి స్పందించారు

లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు మరోసారి స్పందించారు. ‘స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమానికి మద్దతిస్తే ఏపీ విషయాలు నీకెందుకని అంటున్నారు. దేశంలో ఏపీ రాష్ట్రం కాదా’అని ప్రశ్నించారు. ‘తెలంగాణ జీవితం– సామరస్య విలువలు’అనే అంశంపై శుక్రవారం ఇక్కడ తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘ఇవాళ విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్ముతున్నారు. రేపు సింగరేణి, బీహెచ్‌ఈఎల్‌పై కూడా పడతారు. ఏపీకి కష్టం వచ్చింది కదా.. మాకేంటి సంబంధమని నోరు మెదపకుండా ఉంటే ఎలా’ అని ఎదురు ప్రశ్నించారు.

ఏపీ విషయంలో నోరు మూసుకుని కూర్చోబోమని స్పష్టం చేశారు. ‘రేపు తెలంగాణకు కష్టం వస్తే మా వెంట ఎవరుంటారు. మేం మొదట భారతీయులం.. ఆ తర్వాతే తెలంగాణ బిడ్డలం. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా అందరూ ఆలోచించాల’ని కేటీఆర్‌ అన్నారు. బీజేపీ జాతీయవాదంలో తెలంగాణ జాతి ప్రయోజనం ఎందుకు లేదని నిలదీశారు. బీజేపీ ధోరణి చూస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేట్‌పరం చేస్తామంటారేమో అని ఎద్దేవా చేశారు. సీఈవోలను పెట్టి పాలిస్తామంటారేమో నన్నారు. తనకు కూడా బూతులు వచ్చు.. మోదీని తిట్టలేనా? అని అన్నారు.
 
వారంతా వాట్సాప్‌ యూనివర్సిటీ 
బీజేపీలో పనిచేసే విద్యార్థులు రాష్ట్ర యూనివర్సిటీలలో చదవలేదని, వారంతా వాట్సాప్‌ యూనివర్సిటీలలో చదువుతున్నారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రాజకీయాలకు తావు లేకుండా  వీసీలుగా నియమించి నిజాయితీ చాటుకున్నామని చెప్పారు. హెచ్‌సీయూ వీసీ నియామకంలో రాజకీయం చేసింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ రాజకీయాల వల్ల రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వివాదాలకు పోకుండా అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. విభజన చట్టంలో సమస్యలు ఉన్న ప్పటికీ మనం ఆరున్నరేళ్ల సమయం లోనే ఎంతో ప్రగతి సాధించామని చెప్పారు. 2016లో కేంద్రం ఇచ్చిన పీఆర్సీ కేవలం 14 శాతం మాత్రమే అని స్పష్టం చేశారు. 14 శాతం పీఆర్సీ ఇచ్చినోడు వచ్చి 43 శాతం పీఆర్సీ ఇచ్చినవారిని ప్రశ్నించే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు, అడ్వకేట్లు, జర్నలిస్టు మిత్రులతో తమది పేగుబంధం అని పేర్కొన్నారు. గత పదిరోజులుగా ఉద్యమ సహచరులను కలుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌ శ్రీధర్‌తోపాటు పాపిరెడ్డి, నర్సింహారెడ్డి, వెంకన్న, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement