
మీడియాతో గిరిరాజ్‌సింగ్, కిషన్‌రెడ్డి
తెలంగాణ పత్తి రైతులకు అండగా ఉంటాం.. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ హామీ
రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోందని ధ్వజం
పత్తి రైతుల సమస్యలపై గిరిరాజ్‌సింగ్‌తో చర్చించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బృందం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పత్తి రైతులు ఎంత పండిస్తే అంత పత్తిని కొనుగోలు చేస్తామని.. పత్తి చివరి కిలో వరకూ సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని పత్తి రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. బాధ్యతల నుంచి పారిపోతోందని ఆరోపించారు. రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం ఉండాలని సూచించారు. మంగళవారం ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరుల బృందం రాష్ట్ర పత్తి రైతుల సమస్యలను వివరించేందుకు గిరిరాజ్ సింగ్‌తో సమావేశమైంది.
అనంతరం గిరిరాజ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ‘తెలంగాణలో 20 లక్షల మంది పత్తి రైతులు 18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తుండగా వారి నుంచి సీసీఐ 80 శాతం పత్తిని కొనుగోలు చేస్తోంది. గతంలో ఎంత సేకరించామో అంతకు మించి సేకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతుల కమిటీలను ఏర్పాటు చేసి వారి సమస్యలను పారదర్శకంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. పత్తిలో తేమ శాతం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించాల్సి ఉండగా అలా చేయట్లేదు. ఉపాధి హామీ పథకం నిధులను ఉపయోగించుకొని పత్తిని ఆరబెట్టి ఆ తర్వాతే కొనుగోలు కేంద్రాలకు పంపాల్సి ఉన్నప్పటికీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేంద్రంపై మాత్రం నిందలు వేస్తోంది. ఇది సరికాదు’అని పేర్కొన్నారు.
రైతులు ప్రైవేటు వ్యక్తులకు పంట విక్రయించొద్దు: కిషన్‌రెడ్డి
పత్తి రైతులు ప్రైవేటు వ్యక్తులకు పంటను విక్రయించొద్దని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. తేమ శాతం ఎక్కువుందన్న పేరుతో ప్రైవేటు వ్యక్తులు ధర తగ్గించి కోనుగోలు చేయడం వల్ల రైతులకే నష్టం జరుగుతుందని చెప్పారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌తో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పత్తి కొనుగోళ్లలో ఏటా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు కూడా వాటిని పరిష్కరించేందుకే కేంద్ర మంత్రితో సమావేశమయ్యాం. సీసీఐ చైర్మన్‌తోనూ పలు విషయాలు చర్చించాం. పత్తిలో 12 శాతం తేమ ఉన్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటను సీసీఐ కొనుగోలు చేస్తోంది. పత్తి రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు జరపాలని గిరిరాజ్ సింగ్‌ను కోరాం. హై డెన్సిటీ కాటన్ ప్లాంటేషన్ ద్వారా రైతుల ఆదాయం మూడింతలు అవుతోంది. తెలంగాణలో ఎందుకు ఆ విత్తనాలను వినియోగించట్లేదని గిరిరాజ్‌సింగ్ అడిగారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. 122 సెంటర్లలోని రైతు కమిటీల ప్రతినిధులు, అధికారులకు సమస్యలను చెబితే వారు వెంటనే పరిష్కరిస్తారు. తేమ శాతాన్ని కచి్చతత్వంతో కొలిచే ఆధునిక మెషీన్లను అందుబాటులోకి తెచ్చాం’అని తెలిపారు.