మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం
కేంద్రం ఒక్క నెలలోనే దాదాపు రూ. 28 వేల కోట్లను రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేసింది
మెట్రో రెండో దశలో 50 శాతం వ్యయం భరించడానికి సిద్ధంగా ఉంది
అవినీతి, అక్రమాలు, అబద్ధాలు, పార్టీలు మారడంలో సీఎం సమర్థుడంటూ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: అవినీతి, అక్రమాలు, అబద్ధాలు, సంచుల మూటలు మోయడం, పార్టీలు మారడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమర్థుడే అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నా.. ఏమీ చేయడం లేదంటూ ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. సోమవా రం తన మంత్రిత్వ శాఖ రెండేళ్లలో సాధించిన ప్రగతిపై మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత ఆయన విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు కిషన్‌రెడ్డి పైవిధంగా స్పందించారు.
కేంద్రం దొడ్డు బియ్యం సేకరించి ఏం చేయాలి?
‘ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రం రూ.26 వేల కోట్లు వ్యయం చేస్తోంది. రాష్ట్రంలో పండిస్తున్న దొడ్డు బియ్యాన్ని ప్రజలకు ఉచితంగా ఇవ్వలేకపోతున్నారు. వారికి సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. అలాంటప్పుడు కేంద్రం దొడ్డు బియ్యాన్ని సేకరించి ఏం చేయాలి? దొడ్డు బియ్యం రాష్ట్ర ప్రజలే తిననప్పుడు మిగిలిన రాష్ట్రాల ప్రజలు తినాలని ఎలా చెప్తాం? దేశంలోని గోదాములన్నీ బియ్యంతో నిండిపోవడం, రబీ సీజన్‌లో భారీగా ధాన్యం వస్తుందన్న ఉద్దేశంతోనే మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయడం జరిగింది.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్‌లో కేవలం 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినట్లు ఉంటే.. ప్రభుత్వం మాత్రం ఏకంగా 70 లక్షలకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు చెబుతోంది. రాష్ట్రంలో పండించే సన్న ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు క్వింటాల్‌కు రూ.4,500కు విక్రయిస్తూ.. ఇక్కడకు మాత్రం రూ.3,500 క్వింటాల్‌కు కొనుగోలు చేసిన బియ్యం సరఫరా చేస్తున్నారు. పది రకాల ధాన్యాలకు బోనస్ ఇస్తామని అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సన్న ధాన్యానికి ప్రకటించి.. ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదు..’ అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.
మెట్రో టేకోవర్‌కు కేంద్రమే రుణం సమకూర్చింది
‘ఎల్ అండ్ టీ నుంచి మెట్రో స్వా«దీనానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేకపోతే.. రైల్వేనే రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 13,500 కోట్లు రుణాన్ని ఇచ్చింది. అంతేకాక మెట్రో రెండో దశకు అయ్యే వ్యయంలో 50 శాతం కేంద్రం భరించడానికి సిద్ధంగా ఉంది. అలాగే మిగిలిన 50 శాతం నిధులను రుణ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవడానికి కూడా అంగీకారం తెలిపింది. మెట్రో టేకోవర్ పూర్తయ్యాక తిరిగి డీపీఆర్ పంపించాలి. అలా పంపించిన డీపీఆర్‌ను కేంద్రంలోని మెట్రోబోర్డు, అలాగే ఇతర మంత్రిత్వ శాఖలు పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తాయి.
ఆ తర్వాత వాటిని కేబినెట్ ఆమోదానికి పంపుతాయి. అలాగే ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి దాదాపు రూ.30 వేల కోట్ల వ్యయం అవుతుంది. గత వారమే కేంద్ర ప్రభుత్వం రెండు జాతీయ రహదారుల కోసం దాదాపు రూ. 7,500 కోట్లకు పైగా నిధులకు ఆమోదం తెలిపింది. ఒక్క నెలలోనే దాదాపు రూ. 28 వేల కోట్లు కేంద్రం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం మంజూరు చేసింది..’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
సింగరేణిలో ఇప్పుడే అవినీతి జరిగిందా?
‘సింగరేణిలో ఏదో బొగ్గు కుంభకోణం జరిగిందని కేటీఆర్ మాకు లేఖ రాసిన విషయం వాస్తవమే. సింగరేణిలో ఇప్పుడే అవినీతి జరిగిందా? గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అప్పుడు ఒక్క విషయంలోనూ హరీశ్‌రావు, కేటీఆర్‌లకు నేను కేంద్ర మంత్రినని గుర్తుకు రాలేదు కానీ.. ఇప్పుడు అవినీతి జరిగిందంటూ.. అందులో కిషన్‌రెడ్డికి కూడా వాటా ఉందా అని ప్రశ్నించడం ఏమిటి. వారి హయంలో సింగరేణిలో అవినీతి జరగలేదా? ఒక్క సింగరేణిలోనే కాదు.. ప్రస్తుత ప్రభుత్వంలో ఏ విభాగంలో అవినీతి జరగడం లేదో చెప్పాలి?..’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.


