
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార ఎజెండా, అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ దిశానిర్దేశం
సమన్వయ కమిటీల ఏర్పాటుపై కసరత్తు.. కీలక నేతలకు ప్రచార బాధ్యతలు
పార్టీ విజయావకాశాలపై సర్వేలు.. 18కిపైగా జెడ్పీల్లో గెలుస్తామని అంచనాలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడంపై బీఆర్‌ఎస్ దృష్టి సారించింది. ఈ వారాంతంలో నియోజకవర్గ స్థాయిలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ప్రకటించారు. ఆలోగా జిల్లాలు, నియోజకవర్గాలవారీగా సమావేశ తేదీలను నిర్ణయించే బాధ్యతను మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు. ఈ సమావేశాలకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలతోపాటు జిల్లా ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు.
స్థానిక ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు, అభ్యర్థుల ఎంపికలో అనుసరించే విధివిధానాలను కేసీఆర్ దిశానిర్దేశానికి అనుగుణంగా పార్టీ కేడర్‌కు వివరించనున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో గ్రామ పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలతోపాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా వివరించనున్నారు. 20 నెలలుగా కాంగ్రెస్ పాలనా వైఫల్యాలు, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య లోపం, బీసీ రిజర్వేషన్లలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలపై కేడర్‌కు అవగాహన కల్పించనున్నారు.
సమన్వయ కమిటీల ఏర్పాటుపై కేటీఆర్ దృష్టి
స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతర్గతంగా సమన్వయం కోసం పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీల ఏర్పాటుపై కేటీఆర్ దృష్టి సారించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు ఈ కమిటీల్లో చోటు కల్పించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్‌చార్జి సమన్వయకర్తగా వ్యవహరించే కమిటీల్లో గ్రామాలవారీగా రాజకీయ పరిస్థితులను మదింపు చేయనున్నారు.
స్థానిక సంస్థల రిజర్వేషన్ల అధారంగా అభ్యర్థుల ఎంపిక, ఇతర పార్టీల నుంచి చేరికలు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీకి దూరమైన నాయకులు, కార్యకర్తలను తిరిగి చేర్చుకోవడం వంటి అంశాలపై సమన్వయ కమిటీలు దృష్టి సారించనున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన చర్చ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.
మరోవైపు అవసరమైన చోట ముఖ్య నేతలను కూడా ప్రచార బరిలోకి దించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు మాజీ మంత్రులు ప్రచార కమిటీల్లో ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్థానిక ఎన్నికలు జరగని హైదరాబాద్, మేడ్చల్ జిల్లా పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు కూడా ఇతర జిల్లాల్లో సమన్వయం, ప్రచార బాధ్యతలు అప్పగించాలని పార్టీ భావిస్తోంది.
స్థానిక ఎన్నికలపై సర్వేలు
స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు, నియోజకవర్గ ఇన్‌చార్జీల పనితీరు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, కాంగ్రెస్, బీజేపీలపై ఓటర్ల మనోగతం తదితరాలపై ఇటీవల బీఆర్‌ఎస్ తరఫున కొన్ని సర్వేలు జరిగాయి. ఈ సర్వే ఫలితాలను విశ్లేషించిన బీఆర్‌ఎస్.. 31 జిల్లా పరిషత్‌లకుగాను 18 నుంచి 20 జిల్లా పరిషత్‌లను గెలుచుకుంటామని అంచనా వేస్తోంది.
రిజర్వేషన్ల ఖరారు తర్వాత జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలోనూ సర్వే ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తోంది. ఈ నెల 24న కేటీఆర్ జన్మదిన వేడుకల అనంతరం పార్టీ యంత్రాంగాన్ని స్థానిక ఎన్నికలకు సిద్ధం చేసేలా కార్యాచరణ వేగవంతం చేస్తామని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.