
సాక్షి, హైదరాబాద్: కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫలాలను యువతరానికి అందించేందుకు తమ ప్రభుత్వం ఏడేళ్లుగా పలు ప్రణాళికలు అమలు చేస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. గురువారం ‘ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం’సందర్భంగా తెలంగాణ యువతకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో దెబ్బతిన్న అన్ని రంగాల మౌలిక వసతులను మెరుగుపరచడంతోపాటు అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాల ద్వారా పునరుజ్జీవనం సాధించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సాగు, తాగునీరు, వ్యవసాయ రంగాల అభివృద్ధితోపాటు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ఐటీ, పారిశ్రామిక రంగాల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయని, ప్రభుత్వ రంగంలో 1.30 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చామని, మరో 50 వేల ఉద్యోగాల నియామకాల కోసం కార్యాచరణ ప్రారంభమైందని చెప్పారు.
వ్యవసాయ రంగం వైపు యువత ఆసక్తి
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో భాగంగా వ్యవసాయం మెరుగవడంతో యువత కూడా ఈ రంగంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ రంగాలతోపాటు వ్యవసాయం, అనుబంధ రంగాలు కూడా పురోగమిస్తున్నాయని, ఐటీ, సాంకేతిక రంగాలకు సంబంధించి యువతలో నైపుణ్యం పెంచేందుకు ‘టాస్క్’ద్వారా శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ఐటీ పాలసీ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పించేందుకు టీసాట్‌తో కార్యక్రమా లు నిర్వహిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.