టీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగ భద్రత 

Job Security Will Come Into Force In Telangana RTC - Sakshi

కొత్త మార్గదర్శకాల ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం 

నేడో రేపో ఉత్తర్వులు.. ఆ వెంటనే అమల్లోకి 

చిన్న చిన్న తప్పులకే కండక్టర్, డ్రైవర్ల తొలగింపు ఉండదు 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో ఎట్టకేలకు ఉద్యోగ భద్రత అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాల ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. 2019లో దీర్ఘకాలం పాటు జరిగిన సమ్మె అనంతరం ఆర్టీసీ ఉద్యోగులతో ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఉద్యోగ భద్రతపై సీఎం హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులు కొత్త మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. అప్పటి నుంచి అది పెండింగులో ఉండటంతో కొద్ది రోజులుగా కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫైలుపై సీఎం సంతకం చేయటంతో అది త్వరలో అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రేపోమాపో విడుదల కానున్నాయి. 

చిన్న విషయాలకే సస్పెన్షన్‌.. 
ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లపై చిన్న చిన్న అంశాలకే ఉద్యోగాలను తొలగించే కఠిన చర్యలు అమలవుతున్నాయి. టికెట్ల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం, టికెట్ల రూపంలో వచ్చిన డబ్బులో పూర్తి మొత్తాన్ని డిపోలో డిపాజిట్‌ చేయకపోవటం, ప్రయాణికులతో దురుసుగా వ్యవహరించటం వంటివాటికే కండక్టర్లపై సస్పెన్షన్‌ వేటు వేస్తున్నారు. టిమ్‌ యంత్రాలు వచ్చాక డ్రైవర్లు కూడా టికెట్లు జారీ చేస్తుండటంతో వారిపై కూడా ఇదే తరహా చర్యలు తీసుకుంటున్నారు. బస్సు నడపటంలో చిన్న చిన్న నిర్లక్ష్యాలకు పాల్పడినా కూడా డ్రైవర్లపై చర్యలుంటున్నాయి. 

ఇప్పుడేం మార్చారు.. 
తప్పు చేసిన వెంటనే కఠినచర్య తీసుకోకుండా కొన్నిసార్లు అవకాశం ఇచ్చేలా తాజాగా మార్గదర్శకాలు రూపొందించారు. బస్సులో 100 శాతానికి మించి ప్రయాణికులున్నప్పుడు ఒకరిద్దరికి టికెట్లు జారీ చేయకపోతే వెంటనే చర్యలు తీసుకోరు. అలాగే డబ్బు కాస్త తగ్గినా వెంటనే చర్యలుండవు. రెండు, మూడుసార్లు అదే తప్పు చేస్తేనే సస్పెన్షన్‌ వేటు పడుతుంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ మహిళా కండక్టర్‌ ప్రయాణికుడితో ‘తెలుగు రానప్పుడు తెలంగాణలో ఎందుకున్నావ్‌’అన్నందుకే సస్పెండ్‌ చేశారు. అదే సమయంలో వరంగల్‌లో లేని ఉద్యోగులు ఉన్నట్లుగా చూపి నిధులు స్వాహా చేసిన విషయంలో అధికారిపై చర్యకు మీనమేషాలు లెక్కించారు. ఆ అధికారికి సహకరించారన్న ఆరోపణ ఉన్న మరో ఉన్నతాధికారిని మాత్రం వదిలేశారు.

విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంలో ఓ ఉన్నతాధికారి రేటు నిర్ణయించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలున్నా కూడా ఎలాంటి చర్యలు లేవు. టికెట్‌ డబ్బులు కలెక్ట్‌ చేయకపోవడం, టికెట్‌ ఇవ్వని సందర్భంలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ కండక్టర్లకు మొదటి దఫా చర్యలు ఉండవు. ఇది పునరావృతం అయితే తొల గించకుండా ఇతర చర్యలు తీసుకుంటారు. డీలక్స్‌ అంతకన్నా పెద్ద బస్సు అయితే సీట్ల సంఖ్య కంటే ప్రయాణికులు తక్కువున్నప్పుడు  ఈ తప్పుకు సస్పెన్షన్‌ చేస్తారు. రుసుము వసూలు చేసి టికెట్‌ ఇవ్వకుంటే డీలక్స్‌ కంటే తక్కువ కేటగిరీ బస్సుల్లో తొలగించకుండా ఇతర చర్యలు తీసుకుంటారు. డీలక్స్‌ అంతకంటే ఎక్కువ కేటగిరీ బస్సులు అయితే సస్పెన్షన్‌లో ఉంచుతారు. అవసరం అయితే తొలగిస్తారు. ఇలా మార్గదర్శకాల్లో పలు మార్పులు చేశారు. 

వేధింపులుండవు: మంత్రి పువ్వాడ 
ఆర్టీసీ కార్మికులను కొందరు అధికారులు చిన్నచిన్న తప్పులకే వేధిస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఉద్యో గభద్రతకు అవకాశం కల్పించటం గొప్ప విషయం. వేధింపులు లేకుండా ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టింది. ఉద్యోగులు ప్రశాంతంగా విధులు నిర్వహించుకోవచ్చు. సంబంధిత ఫైలుపై సంతకం చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. వేధింపులు లేకుండా మాత్రమే ఉద్యోగ భద్రత, అలా అని తప్పులు చేసినా పట్టించుకోరని అనుకోవద్దు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top