25న రాజీనామా చేస్తున్నా.. | Jeevan Reddy says he will resign from the party on the 25th of this month | Sakshi
Sakshi News home page

25న రాజీనామా చేస్తున్నా..

Mar 23 2026 1:16 AM | Updated on Mar 23 2026 1:16 AM

Jeevan Reddy says he will resign from the party on the 25th of this month

అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నా.... పార్టీని వీడటానికి సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఒక కారణం 

మాజీమంత్రి జీవన్‌రెడ్డి  

జగిత్యాల టౌన్‌: పార్టీలో 20 నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తాను అవమానాలు భరించలేకే కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయం తీసుకున్నానని, ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేస్తానని మాజీమంత్రి జీవన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జగిత్యాలలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంతకాలం తనతో కలిసి నడిచిన నాయకులు, అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. 

దశాబ్దాల పోరాట ఫలితాన్ని ఎవరో కాజేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నానని సీనియర్‌ నేత భావోద్వేగానికి గురయ్యారు. సంయమనం పాటించాలని మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కోరారని, అయితే సంయమనంతో ఎలాంటి ఉపయోగమూ లేదని భావించి రాజీనామాకు సిద్ధపడ్డానని తెలిపారు. తాను పార్టీకి రాజీనామా చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఒక కారణమన్నారు.  

నాకు మంత్రి అయ్యే అర్హత లేదా?
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఎంత పోరాటం చేశారో.. మండలి ఏకైక సభ్యుడిగా తానూ అంతేస్థాయిలో పోరాటం చేశానని జీవన్‌రెడ్డి చెప్పారు. వారిద్దరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవి పొందినప్పుడు తనకు మంత్రి పదవి ఆశించే హక్కు లేదా..? అని ప్రశ్నించారు. పార్టీ కోసం ఒంటరి పోరాటం చేసిన తనకు మంత్రి అయ్యే అర్హత లేదా..? అని అడిగారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకొచ్చే నాటికి మండలి సభ్యుడిగా తనకు 20 నెలల కాలం మిగిలి ఉందని గుర్తు చేశారు.  

నేను ఒక్కసారి చెబితే..!
జీవన్‌రెడ్డి, రజినీకాంత్‌తో పోస్టర్‌ సీనియర్‌ నేత, మాజీమంత్రి జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే జగిత్యాలలోని ఆయన నివాసం వద్ద వెలసిన ఒక పోస్టర్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. అందులో ఒకవైపు జీవన్‌రెడ్డి ఉంటే మరోవైపు ప్రముఖ నటుడు రజినీకాంత్‌ ఉండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 

కాగా పోస్టర్‌ మధ్యలో ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే..’ అన్న రజినీకాంత్‌ ఫేమస్‌ డైలాగ్‌ ఆంగ్లంలో ఉండటం, దాని కింద ‘తెలంగాణ పొలిటికల్‌ సూపర్‌స్టార్‌ జీవన్‌రెడ్డి’ అని ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. జీవన్‌రెడ్డి ఒకసారి రాజీనామా నిర్ణయం తీసుకున్నాడంటే వెనక్కి తగ్గే వ్యక్తి కాదనే అర్థం వచ్చేలా ఈ పోస్టర్‌ ఏర్పాటు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement