సాక్షి హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వారికి కాంగ్రెస్‌లో పెద్ద పీట వేస్తే వారి పక్కన ఎలా కూర్చుంటామని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.10 ఏళ్లు బీఆర్ఎస్ పై తాము పోరాటం చేసిన నాయకులకు కాంగ్రెస్‌లో పెద్దపీట వేస్తే కేత్రస్థాయిలో ఉన్న నాయకులకు ఏమని సమాధానం చెప్తామని ప్రశ్నించారు. అందుకే అది జీర్ణించుకోలేకపోయానని, పీసీసీకి క్షమాపణలు చెప్పి గాంధీ భవన్ నుంచి బయిటకి వెళ్లిపోయానని జీవన్ రెడ్డి తెలిపారు.
స్పీకర్‌తో తానే స్వయంగా పార్టీ మారలేదని చెప్పారని అలాంటి వారిని సమావేశానికి పిలవాల్సిన అవసరమేముందన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడిన నాయకులను చులకన చేస్తున్నారని పార్టీలో ఇటువంటి పరిస్థితి వస్తుందని తాను ఉహించలేదన్నారు. నిన్నటి వరకూ సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాల పై పోరాటం చేశాను. ఇప్పుడేమో మీటింగ్ లో అలాంటి వ్యక్తి ని పక్కను కూర్చోబెట్టారు. రాజ్యాంగాన్ని ఉల్లంగించిన వ్యక్తి ని పార్టీ అంతర్గత సమావేశంలో కూర్చోబెట్టడం ఏంటని ప్రశ్నించారు.
ప్రస్తుతం జరుగుతున్న సమావేశం పార్టీ విధానానికి రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియాగాంధీ విధానానికి వ్యతిరేకంగా జరుగుతుందన్నారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి అప్రతిష్ఠ తెచ్చేలా ఈ సమావేశం జరిగిందన్నారు. నాలుగు దశాబ్దాలుగా తాను కాంగ్రెస్‌లో కొనసాగుతున్నానని కాంగ్రెస్ పార్టీ తనకు ఎంతో విలువ ఇచ్చిందని జీవన్ రెడ్డి తెలిపారు.
తాను ఎన్నో కష్టాలు భరించి పార్టీలో ఉన్నానని ఇప్పుడు దాని నుండి ఎందుకు వెళ్లిపోతానన్నారు. కాంగ్రెస్ తనపార్టీ అని కేవలం ఈ రోజు జరిగిన మీటింగ్‌కు మాత్రమే నిరసనగా బయిటకి వెళుతున్నానని తెలిపారు.


