ఇంకా 2 నెలలు కావాలి!  | Sakshi
Sakshi News home page

ఇంకా 2 నెలలు కావాలి! 

Published Tue, Feb 21 2023 1:57 AM

Jal Shakti Department  Appeal To Supreme Court On Polavaram Flood - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్య పరిష్కారం విషయంలో సుప్రీం కోర్టు సూచన మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల సీఎంలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆ శాఖ తాజాగా సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇందుకు మరికొంత సమయం కావాలని, మంగళవారం సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణను రెండు నెలలకు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌ అరవింద్‌కుమార్‌ శర్మ ఇటీవల సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కి లేఖ రాశారు. 

►పోలవరం ప్రాజెక్టుతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ముంపు ప్రభావం తీవ్రంగా ఉందని, నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ ఆయా రాష్ట్రాలు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పోలవరం ముంపు సాంకేతికపరమైన అంశం కావడంతో సంబంధిత రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖను ఆదేశిస్తూ గతేడాది నవంబర్‌ 6న సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అదేవిధంగా ఆయా రాష్ట్రాల సీఎంలతోఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి విభేదాలను సైతం పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే నాలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీలు మూడు విడతలుగా సమావేశాలు నిర్వహించి సాంకేతికపర అంశాలను ఓ కొలిక్కి తెచ్చాయి. సుప్రీంలో కేసు తదుపరి విచారణకు వచ్చే నాటికి సీఎంలతో కూడా సమావేశం నిర్వహించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రయత్నాలు చేస్తోంది.  

15న సాధ్యం కాని సీఎంల సమావేశం... 
వాస్తవానికి ఈ నెల 15న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తామని, రాగలరో లేదో తెలిపాలని ..పేర్కొంటూ ఆశాఖ ఈ నెల 8న ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సీఎంలకు లేఖ పంపించింది. కొన్ని రాష్ట్రాల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో 15న సమావేశం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో మరో కొత్త తేదీని ప్రతిపాదిస్తూ ఆయా రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి శాఖ మళ్లీ లేఖ రాయనుంది. సంబంధిత రాష్ట్రాల సీఎంలు సానుకూలంగా స్పందిస్తేనే ఈ సమావేశం సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. 

కొలిక్కి వచ్చిన సాంకేతిక అంశాలు.. 
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గతేడాది సెప్టెంబర్‌ 29న 4 రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ తొలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అక్టోబర్‌ 7న కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) మరో సమావేశాన్ని నిర్వహించి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి సాంకేతిక అంశాలపై సంప్రదింపులు జరిపింది.

ఆ తర్వాత సీడబ్ల్యూసీ సూచన మేరకు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలు తమ అభ్యంతరాలు, డిమాండ్లతో టెక్నికల్‌ నోట్స్‌ను సమర్పించగా, వీటిని పరిశీలించి సీడబ్ల్యూసీ వివరణలు పంపించింది. ఏపీ నుంచి సైతం వివరణలు తీసుకుంది. సీడబ్ల్యూసీ ఇచ్చిన వివరణలపై మళ్లీ మూడు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను పంపించాయి. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలపై పరిశీలన అనంతరం పోలవరం ముంపు ప్రభా వానికి సంబంధించిన సాంకేతిక అంశాలను కొలిక్కి తెచ్చి ఓ నివేదికను సీడబ్ల్యూసీ సిద్ధం చేసింది. సీఎంలతో సమా వేశం అనంతరం ఈ నివేదికకు తుది రూపు ఇచ్చి సుప్రీం కోర్టులో జరిగే తదుపరి విచారణలో సమర్పించనుంది.  

ఉమ్మడి సర్వేకి ముందుకు రావాలి.. పీపీఏ లేఖ 
గత నెల 25న నాలుగు రాష్ట్రాల అధికారులతో సీడబ్ల్యూసీ నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు తెలంగాణలో పోలవరం ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వేకి ముందుకు రావాలని సూచిస్తూ తాజాగా ఏపీకి పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ లేఖ రాసింది. వానకాలం ప్రారంభానికి ముందే సర్వే నిర్వహించాలని తెలంగాణ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఉమ్మడి సర్వేలో తేలిన అంశాల ఆధారంగా ముంపు నివారణకు పోల వరం ఆథారిటీ/ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమావేశం మినిట్స్‌లో సీడబ్ల్యూసీ పేర్కొంది.   

Advertisement
Advertisement