
ఆదివారం హైదరాబాద్‌లోని క్యూ న్యూస్ కార్యాలయంలో దాడి చేస్తున్న జాగృతి కార్యకర్తలు
మల్లన్నతోపాటు పలువురికి స్వల్ప గాయాలు
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని దాడులు
క్యూ న్యూస్ ఆఫీస్‌లో కర్రలు, రాడ్లతో విధ్వంసం
గాల్లోకి కాల్పులు జరిపిన మల్లన్న గన్‌మెన్
దాడులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు: తీన్మార్ మల్లన్న
మేడిపల్లి/ఘట్‌కేసర్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు చెందిన క్యూన్యూస్ కార్యాలయంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చెందిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని క్యూన్యూస్ ఆఫీస్‌లోకి ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో సుమారు 20 మంది కర్రలు, రాడ్లతో దూసుకొచ్చి చానల్ సిబ్బందిపై దాడి చేస్తూ విధ్వంసం సృష్టించారు. అక్కడే ఉన్న మల్లన్నపై కూడా దాడికి ప్రయతి్నంచారు. కార్యాలయంలోని ఫరి్నచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు.
వారిని అదుపుచేసేందుకు మల్లన్న గన్‌మెన్‌లు గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ లోపుగా మల్లన్న మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. గాయపడిన ఆఫీస్ సిబ్బందిని, మల్లన్నను చికిత్స నిమిత్తం ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మల్లన్న చేతికి స్వల్ప గాయం కావడంతో చికిత్స అందించి ఆస్పత్రి నుంచి పంపించారు. ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ జాగృతి కార్యకర్తలే ఈ దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
దాడులకు భయపడను: మల్లన్న
తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడిని తీన్మార్ మల్లన్న తీవ్రంగా ఖండించారు. హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టంచేశారు. దాడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘20 మంది వరకు కర్రలు, రాడ్లతో దూసుకొచ్చి నాతోపాటు మా కార్యాలయం సిబ్బందిపై పాశవికంగా దాడి చేశారు. నాతో సహా పలువురికి గాయాలయ్యాయి. దాడి తీవ్రతను చూసి వెంటనే గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌడ్లు కాల్పులు జరిపారు. హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. ఇలాంటి దాడులకు బయపడేది లేదు. కంచం–మంచం అనే పదం తెలంగాణలో ఊతపదం. నా వ్యాఖ్యలకు కట్టుబడి వున్నా.
రౌడీల్లా నాపై దాడి చేయడమే కాకుండా మళ్లీ నాపైనే కేసు పెట్టారు. నా ఆఫీస్‌లో నా రక్తాన్ని కళ్లచూశారు. ఈ రక్తం మరకలతోనే ప్రజల్లోకి వెళతాను. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలి’అని డిమాండ్ చేశారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజారెడ్డి, ఏసీపీ చక్రపాణి, మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ గోవింద్ రెడ్డి తమ సిబ్బందితో ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడి ఘటనలో గాయపడ్డ ఆందోళనకారులు రాంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మేడిపల్లి పోలీసుల అదుపులో జాగృతి యాదాద్రి జిల్లా అధ్యక్షుడు సందుపట్ల సుజిత్‌రావు, ఓయూ జాగృతి అధ్యక్షుడు ఆశోక్ యాదవ్‌తోపాటు మరికొందరు ఉన్నట్లు తెలిసింది.