
సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు
450 ఎకరాల్లో ఏర్పాటుకు సత్వర చర్యలు
గతంలో ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌లకు ఇచ్చిన 200 ఎకరాలు
పారిశ్రామికాభివృద్ధి సంస్థకు చెందిన మరో 250 ఎకరాలు గుర్తింపు
ఈ 450 ఎకరాల్లో మొదటి దశ నాలెడ్జి హబ్ ఏర్పాటు
అధికారులను ఆదేశించిన భట్టి, శ్రీధర్‌బాబు, పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని పుప్పాలగూడలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. మొదటి దశ కింద 450 ఎకరాల్లో ఏర్పాటుకు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గతంలో ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్, రెవెన్యూ అధికారులకు, స్పెషల్ పోలీసు మ్యూచువల్ కో ఆపరేటివ్ సొసైటీకి కేటాయించిన 200 ఎకరాలతో పాటు, పారిశ్రామికాభివృద్ధి సంస్థకు చెందిన మరో 250 ఎకరాల స్థలంలో ఐటీ నాలెడ్జ్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
గురువారం సాయంత్రం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమలు, రెవెన్యూ శాఖల కీలక అధికారులతో మంత్రులు సమావేశమయ్యారు. పుప్పాలగూడలో భూముల లభ్యతపై అధికారులు వివరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులకు కేటాయించిన భూములను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సొసైటీలకు కేటాయించిన భూముల పక్కనే ఇండ్రస్టియల్ కార్పొరేషన్‌కు సంబంధించిన సుమారు 250 ఎకరాల భూమి ఉందని తెలిపారు. మొత్తంగా 450 ఎకరాలు అందుబాటులో ఉందని వివరించారు. చెప్పారు. మొదటి దశలో ఏర్పాటు చేయబోతున్న ఐటీ హబ్ ద్వారా 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.
ప్రత్యామ్నాయంగానేనా..?
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ)ను అనుకుని ఉన్న 400 ఎకరాల భూమిని అభివృద్ధి చేసి 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించగా, దానిపై వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. కంచ గచ్చిబౌలి భూముల్లో 100 ఎకరాల్లో తొలగించిన చెట్ల స్థానంలో మళ్లీ వృక్షాల పెంపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో దీనికి ప్రత్యామ్నాయంగా అత్యవసరంగా ప్రభుత్వం పుప్పాలగూడలో నాలెడ్జ్ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.