
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్లలో డ్రగ్స్ కలకలం రేగింది. సెరీన్ ఆచార్జ్ ఫాంహౌస్‌లో బర్త్‌డే వేడుకలు పేరుతో డ్రగ్స్, విదేశీ మద్యంతో హంగామా చేస్తుండగా.. ఎస్‌టీఎఫ్ బీ టీమ్, ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపారు. బర్త్‌డే సందర్భంగా ఐటీ ఉద్యోగి అభిజిత్ బెనర్జీ ఈ ఫాంహౌస్‌ను బుక్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫాంహౌస్ నిర్వాహకుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
పక్కా సమాచారంతో ఫాంహౌస్‌లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. ఐటీ ఉద్యోగుల నుంచి రూ.రెండు లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మూడు లగ్జరీ కార్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. డ్రగ్స్‌ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురు ఐటీ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
