ట్రిపుల్‌ ఐటీలో ఇంటర్‌ తరహా పరీక్షలు

Inter Type Examinations In Basara IIIT - Sakshi

ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ

పీయూసీ విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు నిర్ణయం

బాసర (ముధోల్‌): బాసర ట్రిపుల్‌ ఐటీలో ఈ విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్‌ పరీక్షలకు బదులు ఇంటర్మీడియట్‌ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ఇదే అంశంపై ‘సాక్షి’ పత్రిక గతంలోనే కథనాలను ప్రచురించింది. తాజాగా ఆ విషయాన్నే ఇన్‌చార్జి వీసీ ప్రకటించారు. మొదటి రెండు సంవత్సరాల పీయూసీ–1, 2 చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ట్రిపుల్‌ ఐటీ ఆధునీకరణకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి శనివారం వర్సిటీ సందర్శనకు వస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేస్తారని వివరించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వీసీలు కూడా త్వరలో ట్రిపుల్‌ ఐటీని సందర్శిస్తారన్నారు. 

డిసెంబర్‌లో స్నాతకోత్సవం 
బాసర ట్రిపుల్‌ ఐటీలో స్నాతకోత్సవ కార్యక్రమాన్ని డిసెంబర్‌లో నిర్వహిస్తామని ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ఈ1, ఈ2 విద్యకు అవసరమయ్యే 2,200 ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు సమకూర్చినట్లు వెల్లడించారు. యూనిఫామ్‌కు సంబంధించి టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని, విద్యార్థులకు అవసరమయ్యే బూట్లను తెలంగాణ రాష్ట్ర లెదర్‌ ఇండస్ట్రీ సంస్థ సరఫరా చేస్తుందని చెప్పారు.

ట్రిపుల్‌ ఐటీ అవసరాల దృష్ట్యా మరో 24 తరగతి గదులను ప్రస్తుత భవనాలపై నిర్మిస్తామని వెల్లడించారు. కాగా, కళాశాలలోని 27 ఎకరాలలో ఎకో పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ సతీశ్‌కుమార్‌ తెలిపారు. రూ.3 కోట్లతో యూనివర్సిటీలో స్పోర్ట్స్‌ స్టేడియాన్ని నిర్మించన్నుట్లు ఆయన చెప్పారు. కళాశాలలో తల్లిదండ్రులు విద్యార్థులను కలిసేందుకు విజిటింగ్‌ అవర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఇన్‌చార్జి వీసీ.. ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌లో వీసీ డాష్‌ బోర్డు, విద్యార్థుల ఈ–ప్రొఫైల్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top