
మోపాల్ (నిజామాబాద్ రూరల్): నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని సింగంపల్లి గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను దాయాదులు గుంజకు కట్టేసి చితకబాదిన సంఘటన రెండురోజుల తర్వాత వెలుగు లోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరా లు.. గ్రామానికి చెందిన పల్లికొండ సవిత మతిస్థిమితం లేని భర్త, నలుగురు పిల్లలతో జీవనం సాగిస్తోంది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. సవిత ఇంటి ఎదుట నున్న స్థలంలో ఆమె తోటికోడలు పల్లికొండ లక్ష్మికి చెందిన గేదెలు, గొర్రెలు ఉంటాయి.
గొర్రెలు, గేదెలు తరచుగా సవిత ఇంట్లోకి వచ్చి మలమూత్రాలు విసర్జించడమే కాకుండా, బియ్యం తినడం వంటివి చేస్తున్నాయి. ఈ విషయమై సవిత పలుమార్లు లక్ష్మి కుటుంబ సభ్యులకు చెప్పినా పట్టించుకోలేదు. మంగళవారం రాత్రి కూడా గేదె సవిత ఇంట్లోకి వెళ్లి బియ్యాన్ని తొక్కి చిందరవందర చేయడంతో లక్ష్మిపై సవిత ఆగ్రహం వ్యక్తం చేసింది. లక్ష్మి కోపంతో సవితను తిడుతూనే మంత్రాలు చేస్తున్నావని ఆరోపించింది.
దీంతో ప్రమాణం చేద్దామని సవిత గేదెను తీసుకుని హనుమాన్ గుడి వద్దకు వెళ్లింది. అక్కడికి వచ్చిన లక్ష్మి సవితను హనుమాన్ ఆలయం వద్దనున్న పెద్ద గుంజకు(కట్టె) కట్టేసింది. లక్ష్మి కొడుకు గంగాధర్, కోడలు మమత, భర్త పల్లికొండ గంగాధర్ అక్కడికి చేరుకుని సవితపై దాడి చేశారు. తనను వదిలిపెట్టాలని సవిత వేడుకున్నా కనికరించలేదు. గంట తరువాత స్థానిక మహిళలు జోక్యం చేసుకుని సవిత కట్లు విప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై జాడె సుస్మిత గురువారం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. పల్లికొండ గంగాధర్, లక్ష్మి, వారి కుమారుడు గంగాధర్, కోడలు మమతను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.