ఈఎస్‌ఐ కుంభకోణం: మాజీ మంత్రి పేషీ నుంచే..!

IMS Scam From Former Minister House - Sakshi

ఐఎంఎస్‌ కుంభకోణంలో అనేక అనుమానాలు

ఈడీ దర్యాప్తులో వెలుగులోకి కొత్త పేర్లు

ఇంతకాలం ఏసీబీ పట్టించుకోకపోవడం వెనుక

రాజకీయ ఒత్తిళ్లు?.. ఏపీలో కూడా ఇదే తరహా స్కామ్‌

పాత్రధారులు వేరైనా సూత్రధారులు ఒక్కరేనా అన్న సందేహాలు

ప్రమోదరెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు.. రూ.1.15 కోట్లు స్వాధీనం

సాక్షి, హైదరాబాద్‌: ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీస్‌ (ఐఎంఎస్‌) కుంభకోణం కేసులో దరాప్తు, సోదాలు చేసిన కొద్దీ అనేక అక్రమాలు, అక్రమార్జనలు వెలుగు చూస్తున్నాయి. అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. రాష్ట్ర కార్మిక శాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి, నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డిల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాజాగా సోదాలు చేయడం, వారి నుంచి దాదాపు రూ.3 కోట్ల నగదు, రూ.కోటి విలువైన నగలను  స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ కేసులో వీరికి కూడా సంబంధాలు ఉన్నప్పుడు మరి రెండేళ్లుగా కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ వీరిని ఎందుకు అరెస్టు చేయలేదు? కనీసం విచారించ లేదా? విచారించినా ఆ విషయాన్ని బయటికి చెప్పలేదా? ఒకవేళ ఏసీబీ వీరిని ప్రశ్నించేందుకు యత్నించినా.. ఏవైనా రాజకీయశక్తులు అడ్డు పడ్డాయా? అప్పటి మంత్రి పేషీ నుంచి కథంతా నడిచిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

2019లో ఏసీబీ విచారణ ప్రారం భమవుతున్న దశలో కార్మిక శాఖకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి ఏసీబీకి ఓ లేఖ రాశారు. అందులో అక్రమాలు కిందిస్థాయిలోనే జరిగాయని, ఉన్నతాధికారులకు సంబంధం లేవన్నట్టుగా పేర్కొన్నారు. అయితే ఇప్పుడదే ఉన్నతాధికారులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా మారి అరెస్టు కావడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

ఏసీబీ నివేదిక ఆధారంగా రంగంలోకి ఈడీ
మనీలాండరింగ్‌ జరిగిందన్న ఏసీబీ నివేదిక (8ఎఫ్‌ఐఆర్‌లు) ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని డిసెంబర్‌ నుంచి ప్రశ్నిస్తోంది. వారిచ్చిన సమాచారం ఆధారంగానే కొత్తగా శ్రీనివాసరెడ్డి, ముకుందరెడ్డిల పేర్లు తెరపైకి రావడం గమనార్హం. కాగా ఇదే పనిని గతంలో ఏసీబీ ఎందుకు చేయలేకపోయింది? అన్న చర్చ సాగుతోంది. ఏపీలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఇదే తరహా కేసులో అరెస్టయ్యారు. ఇక్కడా, అక్కడా కుంభకోణం జరిగిన తీరు (మోడస్‌ ఆపరెండి) ఒకటే కావడం గమనార్హం.

ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై కన్ను
ముకుందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, దేవికారాణి, శ్రీహరిబాబు తదితరుల బ్యాంకు ఖాతాలు, ఆస్తులపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. 2014 నుంచి 2019లో ఈ కేసు వెలుగు చూసే వరకు వీరు, వీరి బంధువుల బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన ఆన్‌లైన్‌ లావాదేవీలు, కొనుగోలు చేసిన ఆస్తులు, వాహనాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కూడబెట్టిన నగలు, చెల్లించిన ఆదాయపు పన్ను తదితరాలను విశ్లేషిస్తోంది. ముఖ్యంగా బ్యాంకు లాకర్లు తెరిచేందుకు అంతే వేగంగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఇంతకాలం అధికారులు మాత్రమే ఈ కుంభకోణంలో ఉన్నారనుకున్నప్పటికీ తాజాగా ఈడీ రంగప్రవేశంతో వాతావరణం వేడెక్కింది. ఈ కుంభకోణానికి మంత్రి కార్యాలయం నుంచే కుట్ర జరిగిందా? అన్న అనుమానాలు వాస్తవానికి ముందు నుంచీ ఉన్నాయి. ఐఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ కలకుంట్ల పద్మలు ఇష్టానుసారంగా, నిబంధనలకు విరుద్ధంగా మందుల సరఫరా కాంట్రాక్టులు ఇచ్చినప్పుడు మంత్రి కార్యాలయం అభ్యంతరం తెలపలేదు. ‘‘కార్మిక శాఖ నిబంధనలకు విరుద్ధంగా నాలుగేళ్లు కాంట్రాక్టులు ఇచ్చినా ఏనాడూ వివరణ కోరలేదు. విజిలెన్స్‌ రంగప్రవేశం చేసేవరకూ ఆడిటింగ్‌లో ఎలాంటి లోపాలు వెలుగుచూడలేదు’’ అంటూ ఈఎస్‌ఐ సిబ్బంది అనేక సందేహాలు లేవనెత్తినప్పటికీ వీటిపై ఏసీబీ అంతగా దృష్టి సారించలేదు. కానీ, ఈడీ కేంద్ర దర్యాప్తు సంస్థ కావడంతో కొత్తపేర్లు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు.

పేద కార్మికుల సొమ్మును తినేశారు!
ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు రూ.700 కోట్లకుపైగా మందుల కొనుగోళ్లలో దాదాపు రూ.200 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టి ఉంటాయని ఏసీబీ అనుమానం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈఎస్‌ఐ ఆసుపత్రి పేద కార్మికులకు ఒక వరం లాంటిది. రూ.25 వేలలోపు వేతనం ఉన్న కార్మికుల నుంచి నెలానెలా రూ.500 వరకు చందా కింద వసూలు చేస్తారు. అలా సేకరించిన నిధులతో పాటు ప్రభుత్వం ఇచ్చే నిధులు కలిపి అనారోగ్యం బారిన పడిన కార్మికులకు వైద్యసేవలు అందిస్తారు.

అలాంటి బీద కార్మికులకు దక్కాల్సిన మందులను, వైద్య పరీక్షలకు కావాల్సిన మెడికల్‌ కిట్లను తదితరాల ధరలను ఇష్టారీతిన పెంచుకుంటూ పోవడం, కమీషన్ల రూపంలో అందినకాడికి దండుకోవడం నాలుగేళ్లపాటు యధేచ్ఛగా సాగింది. ‘‘ఆరుగాలం శ్రమించిన పంటను పందికొక్కులు తిన్నట్లు, తాము చందాగా చెల్లించిన డబ్బులను కొందరు అవినీతిపరులు అదేవిధంగా పంచుకుతిన్నారంటూ’’ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

ఏపీలో కూడా ఇదే తరహాలో రూ.988 కోట్ల కొనుగోళ్లలో సుమారు రూ.150 కోట్లకుపైగా కుంభకోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇక్కడా, అక్కడా.. పాత్రధారులు వేరైనా.. సూత్రధారులు ఒకరేనా? అన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. ఏపీలో జరిగిన ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదల అయిన బుర్రా ప్రమోదరెడ్డి పేరిట తెలంగాణ, ఏపీల్లో 7 డొల్ల కంపెనీలు ఉన్నాయి. కాగా శనివారం హైదరాబాద్‌లో శ్రీనివాసరెడ్డి, ముకుందరెడ్డి ఇంటితో పాటు ప్రమోదరెడ్డి ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించడం, రూ.1.15 కోట్లను స్వాధీనం చేసుకోవడం  గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top