సాక్షి, హైదరాబాద్: మూసీ నదికి పూర్వవైభవం తీసుకురావడంతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మెగా మాస్టర్ ప్లాన్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ మొదటి విడత 19.05 కి.మీ. అభివృద్ధి పనుల కోసం గ్లోబల్ టెండర్లను ఆహా్వనిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నది పరివాహక ప్రాంతాన్ని రెండు ప్రధాన జోన్లుగా విభజించి పనులను చేపట్టనున్నారు. రెండు ప్యాకేజీలకు సంబంధించి ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్స్ (ఈపీసీ) ప్రాతిపదికన డిజైన్ బిల్ట్ కాంట్రాక్ట్‌తో పాటు ఐదేళ్ల పాటు సమగ్ర నిర్వహణ బాధ్యతలను కూడా కాంట్రాక్టర్లకే అప్పగిస్తారు. మూసీ పరిధిలోకి వచ్చే ఔటర్ రింగ్ రోడ్‌పై ఐకానిక్ కేబుల్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టనున్నారు.
మొదట జోన్–1ఏలో హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 7.53 కి.మీ మేర నది నియంత్రణ, వరద నివారణ చర్యలు, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, నది గట్ల బ్యూటిఫికేషన్, రోడ్లు, వంతెనలు, అండర్‌గ్రౌండ్ యుటిలిటీ కారిడార్స్, స్టార్మ్ వాటర్ డ్రైన్లు, ట్రంక్ సీవరేజ్æ లైన్లు, రబ్బర్ డ్యామ్‌ల నిర్మాణం చేపడతారు.
జోన్–1బీలో ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.52 కి.మీ మేర అభివృద్ధి పనులతో పాటు ఔటర్ రింగ్ రోడ్‌పై అత్యంత విలాసవంతమైన ఐకానిక్ కేబుల్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తారు.
ముఖ్యమైన తేదీలివీ:
టెండర్ డాక్యుమెంట్ల్ డౌన్లోడ్ ప్రారంభం: ఈ నెల 15 (సాయంత్రం 4 గంటల నుంచి)
ప్రీ–బిడ్ సమావేశం: ఈ నెల 29 (మధ్యాహ్నం 3 గంటలకు)
బిడ్ల సమర్పణకు చివరి తేదీ: నవంబర్ 26 (సాయంత్రం 5 గంటల వరకు)
టెక్నికల్ బిడ్స్ ఓపెనింగ్: నవంబర్ 27 (ఉదయం 11 గంటలకు)


