
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలను, భూ ఆక్రమణల నిరోధానికి ఏర్పాటైన హైడ్రా మరోసారి కొరడా ఝళిపించింది. నగరంలోని రాజేంద్రనగర్ (Rajendranagar) పరిధిలో బుధవారం దాడులు నిర్వహించిన హైడ్రా రూ.139 కోట్ల విలువైన భూములను అక్రమార్కుల బారి నుంచి కాపాడింది. హైడ్రా అధికారులు బుల్డోజర్లు, జేసీబీలతో అక్రమ నిర్మాణాలను, ఆక్రమణలను తొలగిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అధికారులు తదనుగుణంగా చర్యలు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి...
రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్, ఉప్పరపల్లి (upparpalli) గ్రామాల్లో ఉన్న ‘జన చైతన్య ఫేస్-1, ఫేస్-2’ నిర్మాణాల్లో నాలుగు పార్కుల భూమి ఆక్రమణలకు గురయ్యాయి. ఈ విషయమై స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపిన హైడ్రా అధికారులు.. కబ్జాలను ధ్రువీకరించుకున్నారు.
బుధవారం నాటి చర్యలతో ఆక్రమణలో ఉన్న సుమారు 19,878 గజాల పార్కు స్థలం మళ్లీ ప్రభుత్వం స్వాధీనమైంది. దీని విలువ దాదాపు రూ.139 కోట్లు ఉండవచ్చునని అంచనా.

బుధవారం ఉదయం ఉప్పరపల్లికి చేరుకున్న అధికారులు వేర్వేరు చోట్ల ఉన్న ఆక్రమిత భూముల్లోకి బుల్డోజర్లు, జేసీబీలు నడిపించారు. ఒక్కో ఆక్రమిత ప్రాంతం విస్తీర్ణం 500 నుంచి 3000 గజాల వరకు ఉంది. వీటిల్లోని చెట్లను తొలగించిన అధికారులు స్థలం చుట్టూ ఫెన్సింగ్ పనులు చేపట్టారు. ప్రభుత్వ భూమి అన్న హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు.