ట్రాఫిక్ జామ్‌లతో రెట్టింపవుతున్న కర్బన ఉద్గారాల విడుదల
పీఎం 2.5 పరిమితులు దాటడంతో పెరుగుతున్న శ్వాసకోశ రుగ్మతలు
పారిశ్రామిక ప్రాంతాల్లో విపరీతంగా క్షీణించిన గాలి నాణ్యత
ఐఐటీ హైదరాబాద్, కాన్పూర్ అధ్యయనాల్లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తూ నగరవాసుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. రహదారులపై లేచే ధూళి కేవలం మట్టి కణాలకే పరిమితం కాకుండా కంటికి కనిపించని ప్రమాదకర మైక్రోప్లాస్టిక్స్‌తో నిండిపోతోంది. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ కాన్పూర్, సీఎస్‌ఐఆర్ ఇటీవల చేపట్టిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. రోడ్లపై వాహన చక్రాల నిరంతర రాపిడి, వదిలేసిన సింథటిక్ వ్యర్థాలు విచ్ఛిన్నం కావడం వల్ల ఈ సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
నగరంలో నమోదవుతున్న పీఎం 2.5 కాలుష్యానికి 26 నుంచి 32 శాతం వరకు రోడ్డు ధూళే ప్రధాన కారణమని తేలింది. ఈ కణాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి, రక్తనాళాల్లోకి ప్రవేశిస్తుండటంతో సాధారణ ఆస్తమా, దగ్గు మాత్రమే కాకుండా దీర్ఘకాలంలో ఊపిరితిత్తుల వైఫల్యం, çహృద్రోగాలకు దారితీస్తున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెట్టింపవుతున్న కర్బన ఉద్గారాలు..: మహానగరంలో ఉదయం, సాయంత్రం రద్దీవేళల్లో ప్రధాన రహదారులపై వాహనాలు ట్రాఫిక్‌జామ్‌లలో నిలిచిపోవడం కాలుష్య తీవ్రతను మరింత పెంచుతోంది. సిగ్నల్ జంక్షన్లు, ఐటీ కారిడార్లలో ఇంజన్లను ఆన్‌లోనే ఉంచడం వల్ల కార్బన్ మోనాక్సైడ్, పీఎం 2.5 కణాలు అత్యధిక స్థాయిలో వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. సాధారణ ప్రయాణ సమయం కంటే ఎక్కువ సేపు రోడ్లపై గడపాల్సి రావడం వల్ల ఒకవైపు ఇంధనం విపరీతంగా వృథా అవుతుండగా మరోవైపు ఈ విషపూరిత పొగ నగరవ్యాప్తంగా దట్టంగా అలుముకుంటోంది. ప్రైవేటు వాహన వినియోగం పెరగడం, పారిశ్రామిక ప్రాంతాల్లో సరుకు రవాణా వాహనాల రాకపోకలు గాలి నాణ్యత సూచీని తీవ్ర ప్రమాదకర స్థాయికి నెడుతున్నాయి.
పెరిగిన పీఎం 2.5 పరిమితులు
ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ ముకేశ్‌శర్మ నివేదిక ప్రకారం నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ఐటీ కారిడార్లలో పీఎం 2.5 స్థాయిలు సురక్షిత పరిమితి (15–40)ని దాటి 60 నుంచి 80 వరకు నమోదవుతున్నాయి. ఇక పటాన్¯Œచెరు, జీడిమెట్ల వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఇది ఏకంగా 80 నుంచి 120 స్థాయికి చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ పరిస్థితిని అదుపు చేయడానికి నగర రహదారులపై వ్యాక్యూమ్ స్వీపింగ్ మెషీన్లతో క్రమం తప్పకుండా ధూళిని తొలగించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కఠిన నిషేధం అమలు చేయడం, ఐటీ కారిడార్లలో ఎలక్ట్రిక్, ప్రజారవాణా వినియోగాన్ని ప్రోత్సహించడం, హరితహారం పరిధిని విస్తరించడం తక్షణ అవసరమని స్పష్టం చేస్తున్నారు.
మైక్రోప్లాస్టిక్స్ అంటే..
గాలిలో సుమారు ఒక మైక్రోమీటర్ నుంచి 5 మిల్లీమీటర్ల పరిమాణం వరకు వ్యాపించి ఉండే సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలనే మైక్రోప్లాస్టిక్స్ అంటారు. ఇవి ప్రధానంగా మనం వాడే ప్లాస్టిక్ వస్తువులు, ప్యాకేజింగ్ వ్యర్థాలు, సింథటిక్ దుస్తులు, నిరంతరం రాపిడికి గురయ్యే వాహనాల చక్రాల నుంచి ఏర్పడతాయి. పరిమాణంలో అత్యంత చిన్నవిగా ఉండటం వల్ల ఇవి కంటికి కనిపించకుండా గాలి, నీరు, మట్టిలో సులువుగా కలిసిపోతాయి. శ్వాస ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఇవి కణజాలాల్లో పేరుకుపోయి రసాయన విషపూరిత ప్రభావాలను చూపిస్తూ తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి.
పీఎం 2.5 అంటే..
గాలిలోని దుమ్ము, ధూళి, పొగ, ఇంధన దహన ప్రక్రియలో విడుదలయ్యే నల్లటి మసి, సూక్ష్మ నీటి బిందువులు, ప్లాస్టిక్ కణాలను కలిపి పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) అంటారు. ఇవి 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకన్నా తక్కువ వ్యాసంతో ఉండటాన్ని పీఎం 2.5 అంటారు. అందుకే గాలి నాణ్యతను పీఎం 2.5 ప్రకారం లెక్కిస్తారు. అంటే ఒక మీటర్ వెడల్పు, ఒక మీటర్ పొడవు, ఒక మీటర్ ఎత్తు పరిధిలో ఉండే గాలిలో ఎన్ని పీఎం 2.5 కణాలు ఉన్నాయో లెక్కించడం ద్వారా ఆ ప్రాంతంలోని గాలి నాణ్యతను తెలుసుకుంటారు.


