రాంగ్‌ రూట్‌.. ఇకపై ఫుల్‌ టైట్‌

Hyderabad: Traffic Police Strict Action Against Wrong Route Travellers - Sakshi

నేరేడ్‌మెట్‌(హైదరాబాద్‌):  పక్కనే రాంగ్‌ రూట్‌.. కాస్త దూరం వెళ్తే యూటర్న్‌.. కానీ కొంత మంది రాంగ్‌రూట్‌నే ఎంచుకుంటున్నారు. ఓవైపు వేగంగా వచ్చే వాహనాలు.. మరోవైపు రాంగ్‌రూట్‌లో వెళ్లే వాహనాలతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా కొందరిలో ఎలాంటి మార్పు రావడం లేదు.

ఇప్పటికే రాంగ్‌రూట్‌లో వెళ్లే వారికి అనేక చలాన్లు సైతం వేశారు. ట్రాఫిక్‌ పోలీసులు లేని సమయంలో రయ్యిమంటూ వాహనాలకు ఎదురెళ్తున్నారు. అటునుంచి వేగంగా వచ్చే వాహనాలకు అడ్డుగా వెళ్లడంతో ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడక్కడా ఉండే సీసీ కెమెరాల్లో కనిపించకుండా నంబర్‌ప్లేట్లను చెరిపేస్తున్నారు. కొంతమంది ఆకతాయిలు నంబర్‌ ప్లేట్లకు మాస్కులు కట్టి నంబర్‌ కనిపించకుండా తప్పించుకుంటున్నారు. అలాంటి వారికిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మొదటిసారి అవగాహన కల్పిస్తూ.. రెండోసారి వాహనదారులు చిక్కితే చలాన్లు విధిస్తున్నారు. హెల్మెట్‌ లేకుండా.. నంబర్‌ ప్లేట్‌ కనిపించకుండా ఉన్న వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. 

►    మల్కాజిగిరి ట్రాఫిక్‌ ఠాణా పరిధిలోని నేరేడ్‌మెట్‌లో రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌లు అధికంగా ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. 
►   ఇందులో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులే షార్ట్‌కట్‌లో గమ్యస్థానాలకు వెళ్లడానికి రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. 
►    నేరేడ్‌మెట్‌–ఈసీఐఎల్‌ ప్రధాన మార్గంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. 
►    ఈ మార్గంలో నేరేడ్‌మెట్‌ క్రాస్‌ రోడ్డు, జేజేనగర్‌ చౌరస్తా, సైనిక్‌పురి చౌరస్తాల్లోనే యుటర్న్‌లు ఉన్నాయి. 
►   డిఫెన్స్‌ కాలనీ, వాయుపురి, సైనిక్‌పురితోపాటు పలు కాలనీలు ఉన్నాయి. 
►   ఆయా కాలనీల అంతర్గత రోడ్ల నుంచి ప్రధాన రోడ్ల మీదికి వచ్చే వాహనదారులు రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్నారు. 
►    దాంతో ఎదురుగా వస్తున్న పాదచారులు, ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నాయి.  
►    గడిచిన నెలలో 10 వరకు రాంగ్‌రూట్‌ ప్రయాణం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు. 
►  ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు రాంగ్‌రూట్‌ డ్రైవింగ్‌ నియంత్రణకు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

చదవండి: బైక్‌పై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు.. ఇక్కడో ట్విస్టు కూడా..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top