పెట్రో మంట.. ఆర్టీసీకి కాసుల పంట!

Hyderabad: Rising Diesel Prices Are Bringing Some Benefits To RTC - Sakshi

చాలాకాలం తర్వాత జనంతో బస్సులు కళకళ

చమురు ధరల భయంతో సొంత వాహనాలకు బ్రేక్‌

ఒక్కసారిగా పెరిగిన ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో

సాక్షి, హైదరాబాద్‌: డీజిల్‌ ధరలు వరుసగా పెరుగుతుండటం ఆర్టీసీని తీవ్రంగా కలవరపరుస్తోంది.. ఆ భారాన్ని మోయలేమంటూ ఇటీవల ఏకంగా ముఖ్యమంత్రికే మొరపెట్టుకుంది. కానీ ఇప్పుడు అవే చమురు ధరల పెంపు తమకు మరో రకంగా కలిసొచ్చిందని సంబరపడుతోంది. గత కొన్నిరోజులుగా వరుసపెట్టి పెరుగుతున్న చమురు ధరలతో బెంబేలెత్తుతున్న వాహనదారులు, సొంత బండ్లకు కాస్త విరామం ఇచ్చి బస్కెక్కేందుకు మక్కువ చూపుతున్నారు. దీంతో ఉన్నట్టుండి ఆర్టీసీకి ఆదాయం పెరిగింది.

మళ్లీ మునుపటి రోజులు.. 
గతేడాది మార్చి 21.. ఆర్టీసీకి టికెట్‌ రూపంలో వచ్చిన ఆదాయం రూ.13 కోట్లు.. ఇక అంతే మళ్లీ ఒకరోజు రూ.13 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ కళ్ల చూడలేదు. మధ్యలో సంక్రాంతి సందర్భంగా ఆమేర ఆదాయం నమోదైనా.. అది ప్రత్యేక బస్సుల చలవే.. సాధారణ రోజుల్లో రూ.10 కోట్లను మించటమే గగనంగా మారింది. బస్సులు నడుస్తున్నా సగం సీట్లు ఖాళీగానే ఉంటుండటంతో ఆక్యుపెన్సీ రేషియో లేక ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకున్నారు. ఇప్పుడు డీజిల్, పెట్రోలు ధరలు భారీగా పెరిగిపోవటంతో సొంత వాహనాల్లో తిరిగే చాలామంది బస్సుల వైపు మళ్లటం కనిపిస్తోంది. ఫలితంగా వారం రోజులుగా ఆర్టీసీ ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తోంది. చాలాకాలం తర్వాత గత సోమవారం (15వ తేదీ) ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ.13.25 కోట్లుగా నమోదైంది. అంతకుముందు మూడ్రోజుల పాటు కూడా రూ.13 కోట్లకు కాస్త చేరువగా నమోదైంది. వెరసి లాక్‌డౌన్‌కు పూర్వం ఉన్న పరిస్థితి దాదాపు కనిపిస్తోంది.

సాధారణంగా మంగళవారాల్లో ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. లాక్‌డౌన్‌కు పూర్వం మంగళవారం రోజు సగటు ఆదాయం రూ.11.50 కోట్ల నుంచి రూ.12 కోట్ల మధ్య నమోదయ్యేది. గత మంగళవారం (16వ తేదీ) రూ.11.72 కోట్లు రికార్డయింది. ఏడాది క్రితం ఇదే రోజు ఆదాయం రూ.11.53 కోట్లుగా నమోదైంది. లాక్‌డౌన్‌ తర్వాత మంగళవారాల్లో ఇంత మొత్తం వసూలు కావటం కూడా ఇదే తొలిసారి. మంగళవారం ఆక్యుపెన్సీ రేషియో 66 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే రోజు నమోదైన ఓఆర్‌ 63 శాతమే.. కిలోమీటరుకు ఆదాయం సగటు రూ.34.70గా ఉండగా, గతేడాది ఇదే రోజు రూ.33.25గా నమోదైంది. గతేడాది ఇదే రోజు రాష్ట్రంలో బస్సులు 34.69 లక్షల కిలోమీటర్లు తిరిగితే, గత మంగళవారం (16వ తేదీ) 33.80 లక్షల కి.మీ. తిరిగాయి. అంటే గతేడాది ఇదే రోజు కంటే ఈసారి తక్కువ తిరిగినా ఆదాయం ఎక్కువగా రావటం విశేషం.  

కోవిడ్‌ భయం తగ్గినా.. 
లాక్‌డౌన్‌ సమయంలో సొంత వాహనాల్లో తిరిగేందుకు ప్రాధాన్యమిచ్చిన చాలామంది బస్సులు ఎక్కేందుకు భయపడ్డారు. కానీ కోవిడ్‌ భయం దాదాపు సమసినా కూడా వారిలో పెద్దగా మార్పు రాలేదు. సొంత వాహనాల్లో తిరిగే అలవాటు నుంచి బస్సుల వైపు మళ్లలేకపోయారు. ఫలితంగా ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో 50 శాతాన్ని దాటేందుకు చాలా సమయం పట్టింది. క్రమంగా జిల్లా సర్వీసుల్లో అది 60 శాతాన్ని మించినా సిటీ బస్సుల్లో మరీ తక్కువగా 45 శాతంగానే ఉంటూ వచ్చింది. హైదరాబాద్‌లో సొంత వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. నగరంలో రోడ్లు విపరీతంగా రద్దీగా మారటమే దీనికి నిదర్శనం.. అంతకుముందు క్రమం తప్పకుండా బస్సుల్లో తిరిగిన వారు కూడా సొంత వాహనాలకు అలవాటు పడ్డారు. ఇప్పుడు ఒక్కసారిగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో పెట్రోలు ఖర్చును చూసి బెంబేలెత్తి మళ్లీ బస్సులెక్కేందుకు ఆసక్తి చూపటం ప్రారంభించినట్టు ఆర్టీసీ గుర్తించింది. ఆదాయం ఒక్కసారిగా పెరిగేందుకు ఇదే ప్రధాన కారణమని తేల్చింది.  

పాత ట్రిప్పుల పునరుద్ధరణ.. 
తాజాగా ఆర్టీసీ ఆదాయం పెరగటంతో లాక్‌డౌన్‌కు పూర్వమున్న ట్రిప్పులను పునరుద్ధరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. లాక్‌డౌన్‌ తర్వాత బస్సులు తిరిగి ప్రారంభమైనా.. ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉండటంతో చాలా ప్రాంతాలకు ట్రిప్పులు రద్దు చేశారు. కొన్ని ఊళ్లకు అసలు బస్సులే వెళ్లటం లేదు. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో వారం రోజులుగా ఆక్యుపెన్సీ రేషియో పెరగటంతో మళ్లీ పాత ట్రిప్పులను పునరుద్ధరించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. డిపోల వారీగా అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి, ఇదే మంచి తరుణమని, ప్రజలు తిరిగి బస్సులెక్కేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచిస్తున్నారు. ఒకసారి బస్సులెక్కటం తిరిగి మొదలైతే మళ్లీ వారు సొంత వాహనాల వినియోగానికి ఇష్టపడరన్న విషయాన్ని గుర్తించి సిబ్బంది వ్యవహరించాలని పేర్కొంటున్నారు. ఈ విషయంలో బాగా పనిచేసే సిబ్బందికి పురస్కారాలు ఇవ్వాలని కూడా నిర్ణయించటం విశేషం..  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top