34 అత్యుత్తమ పట్టణాల్లో హైదరాబాద్‌ టాప్‌!

Hyderabad Ranked Best City To Live Work In India Among 34 Cities - Sakshi

హైదరాబాద్‌: ప్రపంచ స్థాయి ర్యాంకింగ్‌లు అయినా, జాతీయ స్థాయి సర్వేల్లోనైనా విశ్వనగరం హైదరాబాద్‌కు ఎల్లప్పుడూ స్థానం ఉంటుందనే విషయం మరోసారి నిరూపితమైంది.ఇటీవల జేఎల్‌ఎల్‌(జోన్స్‌ ల్యాంగ్‌ లస్యాలే) సిటీ మొమెంటం ఇండెక్స్‌ 2020లో ప్రపంచంలోనే అత్యంత డైనమిక్‌ సిటీగా ఎన్నికైన భాగ్యనగర మణిహారంలో మరో మణిపూస చేరింది. హాలిడిఫై.కామ్‌ నిర్వహించిన సర్వేలో 34 అత్యుత్తమ పట్టణాలలో నంబర్‌ వన్‌గా నిలిచింది. భారత్‌లో అత్యంత నివాస యోగ్యమైన, ఉపాధి కల్పించే నగరంగా హైదరాబాద్‌ను పేర్కొంటూ ప్రజలు పట్టం కట్టినట్లు సర్వే తెలిపింది. (చదవండి: ఎస్‌ఐ.. మై హీరో ఆఫ్‌ ది డే)

ఇక పర్యాటకులు, ప్రయాణీకులకు సరైన గమ్యస్థానాన్ని సూచించే ఈ వెబ్‌సైట్‌.. దేశంలోని పలు రాష్ట్రాల ప్రజలకు స్థానం కల్పిస్తూ, విభిన్న సంస్కృతుల కలబోతగా నిలుస్తున్న పట్టణాల ఆధారంగా ఈ సర్వే చేపట్టినట్లు పేర్కొంది. మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, సుస్థిరావృద్ధి, ఆర్థిక వ్యవస్థ తదితర అంశాల ప్రాతిపదికన చేపట్టిన ఈ సర్వేలో హైదరాబాద్‌కు 5 పాయింట్లకు గానూ 4 పాయింట్లు లభించినట్లు వెల్లడించింది. ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై వంటి పలు ప్రధాన పట్టణాలను వెనక్కినెట్టి భాగ్యనగరం ఈ ఘనత సాధించినట్లు పేర్కొంది. (చదవండి: శానిటైజర్‌ కొంటలేరు... )

అదే విధంగా హైదరాబాద్‌లో పర్యటించేందుకు సెప్టెంబరు- మార్చి మధ్య కాలం అనువైనదని, చారిత్రక చార్మినార్‌, గోల్కొండ కోటతో పాటు అనేకానేక గొప్ప గొప్ప ప్రదేశాలను సందర్శించవచ్చని తెలిపింది. దక్షిణ భారతదేశ న్యూయార్క్‌ సిటీగా రూపాంతరం చెందే దిశగా హైదరాబాద్‌ వడివడిగా అడుగులు వేస్తోందని కితాబిచ్చింది. తెలంగాణలో ఉన్న అత్యంత గొప్ప ప్రదేశమని పేర్కొంది. ప్రజలు, సంస్కృతీ సంప్రదాయాలు, అతిథి మర్యాదలతో పాటుగా వ్యాపారాలు చేసుకునేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు హైదరాబాద్‌ అత్యంత అనువైన పట్టణమని పలువురు అభిప్రాయపడినట్లు తెలిపింది. భద్రతాపరంగా, వ్యాపార, వాణిజ్య,  పారిశ్రామిక అంశాల పరంగా హైదరాబాద్‌ అత్యుత్తమమైందని నవతే తులసీ దాస్ వ్యాఖ్యానించారని పేర్కొంది. ఇక వివిధ సంస్థలు పలు దశల్లో జరిపిన సర్వేల్లో 2020లో విశిష్ట నగరాల ఎంపికపై జరిగిన సర్వేలో హైదరాబాద్ నగరం అగ్రస్థానం పొందడంతో పాటు ఖండాంతరాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులను ఆకర్షించే నగరంగా గుర్తింపు పొందింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top