టెస్టులకు విముఖత

Hyderabad People Fearing on COVID 19 Tests - Sakshi

గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే  

ఆరోగ్య పరిస్థితి విషమిస్తే ఆందోళన 

చివరికి గాంధీ, కింగ్‌కోఠి ఆస్పత్రులకు   

రిపోర్ట్‌ లేదని అడ్మిట్‌కు నిరాకరణ 

కార్పొరేట్‌ ఆస్పత్రులకు బాధితులు 

సాక్షి, సిటీబ్యూరో: సరూర్‌నగర్‌కు చెందిన 35 ఏళ్ల యువకుడు నాలుగు రోజులుగా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నాడు. ఆయన ఇంటికి సమీపంలోనే 
కోవిడ్‌ టెస్టులు చేస్తున్నారు. టెస్టు చేయించుకునేందుకు నిరాకరించాడు. అదేమంటే గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడాల్సివస్తుందని, ఇరుగు పొరుగుకి విషయం తెలుస్తుందనే భయంతో ఆయన టెస్టుకు నిరాకరించి, ఇంట్లోనే ఉన్నాడు. రెండు రోజుల తర్వాత అర్ధరాత్రి అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఊపిరాడక పోవడంతో అత్యవసర పరిస్థితుల్లో అతడిని గాంధీకి తీసుకెళ్లగా.. కోవిడ్‌ రిపోర్ట్‌ ఉంటేనే చేర్చుకుంటామని అవుట్‌ పోస్టు సిబ్బంది స్పష్టం చేయడంతో విధిలేని పరిస్థితుల్లో సమీపంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పడకలు ఖాళీ లేకపోవడంతో చేర్చుకునేందుకు నిరాకరించారు. ఆ తర్వాత మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా  ఇదే పరిస్థితి. సకాలంలో చికిత్స అందక అతడు అదే రోజు రాత్రి మృతి చెందాడు.  

రాంనగర్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ కూడా ఇవే లక్షణాలతో బాధపడుతోంది. పాజిటివ్‌ వచ్చినట్లు ఇంటి ఓనర్‌కు తెలిస్తే.. ఇల్లు ఖాళీ చేయమంటారనే భయంతో ఆమె ఎవరికీ విషయం చెప్పకుండా గత వారం రోజుల నుంచి ఇంట్లోనే ఉంది. తీరా శరీరంలో వైరస్‌ ఎక్కువై.. శ్వాస తీసుకోవడం కష్టమైంది. గాంధీకి తీసుకెళ్లింది.  అప్పటి వరకు కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించకపోవడం, చేతిలో రిపోర్ట్‌ లేకపోవడంతో చేర్చుకునేందుకు నిరాకరించారు. కింగ్‌కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. తీరా అక్కడి కి చేరుకుంటే.. ప్రస్తుతం టెస్టింగ్‌ టైం అయిపోయిందని, మరుసటి రోజు ఉదయమే తీసుకొస్తే టెస్ట్‌ చేస్తామని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో వారు బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. టెస్టు చేయిస్తే ఇరుగు పొరుగుకు తెలుస్తుందనే భయం.. ఒకవేళ వైరస్‌ సోకినా తమను ఏమీ చేయలేదనే నిర్లక్ష్యం.. ముఖ్యంగా యుక్త వయస్కులను రిస్క్‌లోకి నెట్టేస్తుంది. అనేక మంది మృత్యువాతకు కారణమవుతోంది.   
 
తేలిగ్గా తీసుకోవడం వల్లే.. 
ప్రస్తుతం 80 శాతం మందిలో ఎసిప్టమేటిక్‌ కేసులే అధికం. వీరికి ఎలాంటి చికిత్సలు అవసరం లేకుండానే వైరస్‌ తగ్గిపోతుంది. కేవలం 15 శాతం మందికే ఆస్పత్రి చికిత్సలు అవసరమవుతుండగా, వీరిలో కేవలం ఐదు శాతం మందికే ఐసీయూ వెంటిలేటర్‌ చికిత్సలు అవసరమవుతున్నాయి. మరణాల రేటు కూడా చాలా తక్కువ. ఇతర దేశాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్‌ చాలా వీక్‌గా ఉందని తెలిసి చాలా మంది దీన్ని లైట్‌గా తీసుకుంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు క న్పించినప్పటికీ.. టెస్టులు, చికిత్సలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తీరా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ పెరిగి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం గాంధీకి తీసుకెళ్తున్నారు. అప్పటి వరకు టెస్టు చేయించకపోవడం, చేతిలో రిపోర్ట్‌ లేకపోవడంతో చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో కార్పొరేట్‌ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. వీరిలో కొంతమందికి పడకలు దొరికినప్పటికీ.. చాలా మందికి అడ్మిషన్‌ దొరకడం లేదు. టెస్టింగ్‌లోనే కాదు చికిత్సల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించి మృత్యువాత ™ è పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత వారి నుంచి కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు, స్నేహితులు వైరస్‌ బారిన పడుతున్నారు.    
 
పోరాడాల్సింది వైరస్‌తో.. అని తెలిసి కూడా.. 
కోవిడ్‌పై మొదట్లో తీవ్ర భయాందోళనలు ఉండేవి. ప్రస్తుతం వైరస్‌పై అవగాహన ఏర్పడింది. ‘పోరాడాల్సింది రోగితో కాదు.. వైరస్‌తో’ అంటూ ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించినప్పటికీ... చాలామంది ఇప్పటికీ బాధితుల పట్ల వివక్ష చూపుతూనే ఉన్నారు. ముఖ్యంగా అద్దె ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, గెటెడ్‌ కమ్యూనిటీల్లో ఉంటున్న వారి పట్ల వివక్ష ఎక్కువగా కొనసాగుతోంది. ఇరుగుపొరుగు వివక్షకు గురయ్యే కంటే.. టెస్టులు చేయించుకోకుండా గుట్టు చçప్పుడు కాకుండా ఇంట్లో ఉండి లక్షణాలను బట్టి మందులు వాడటమే ఉత్తమమే అభిప్రాయంతో బాధితుల కుటుంబ సభ్యులు ఉంటున్నారు. 

ర్యాపిడ్‌ టెస్టుల్లో వందశాతం కచ్చితత్వం లేకపోవడం, ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయకపోవడం, ఒకవేళ శాంపిల్‌ సేకరించిన సకాలంలో రిపోర్టులు జారీ చేయకపోవడం కూడా బాధితుల వెనుకంజకు కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించిన తర్వాత కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేరి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని బాధితుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top