మా పల్లెకు మళ్లొచ్చిపోతరా.. సీఎం సారూ..

Hyderabad: No Development Works In Cm Kcr Adoption Village - Sakshi

దత్తత గ్రామాలను మరిచిన సీఎం 

మూడు చింతలపల్లిలో అభివృద్ధి పనులు పూర్తి 

అందుబాటులోకి రాని భవనాలు 

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన వైనం  

సాక్షి, హైదరాబాద్‌: సీఎం ప్రత్యేక దృష్టితో ఉమ్మడి శామీర్‌పేట మండలం నుంచి కొన్ని గ్రామాలను కలుపుతూ మూడుచింతలపల్లి కేంద్రంగా మండలం ఏర్పడి ఐదేళ్లు పూర్తయ్యింది. నూతనంగా ఏర్పడిన మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక వసతుల కోసం రూ.66కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో అధికారులు, కాంట్రాక్టర్లు ఆగమేఘాల మీద భవనాలను నిర్మించారు. రెండేళ్లుగా ఈ భవనాలు ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీనిపై సంబంధిత అధికారులను వివరణ కోరగా ‘సీఎం కేసీఆర్‌ సారూ’వచ్చి ప్రారంభిస్తారని అంటున్నారు. ప్రారంభోత్సవం పేరుతో ఇలా భవనాలను నిరుపయోగంగా మార్చడం ఎంత వరకు సమంజసమంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.    – శామీర్‌పేట్‌

సీఎం ప్రత్యేక నిధుల నుంచి రూ.66 కోట్ల కేటాయింపు... 
మూడుచింతలపల్లి మండలంలోని కేశవరం, నాగిశెట్టిపల్లి, మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్, లింగాపూర్‌ తాండా తదితర గ్రామాలను 2017లో సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆయా గ్రామాల అభివృద్ధి కోసం రూ.66 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ప్రతీ గ్రామానికి ఓ మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌హాల్, డంపింగ్‌యార్డ్, ధోబీఘాట్‌లు, మోడల్‌ వైకుంఠధామాలు, డ్వాక్రా, గ్రామ పంచాయతీ భవనాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు వంటి తదితర అభివృద్ధి పనులు చేపట్టాని నిర్ణయించారు. 

ఆగమేఘాల మీద పనులు పూర్తి... 
సీఎం కేసీఆర్‌ దత్తత మండలం కావడంతో రాష్ట్ర స్థాయి అధికారులు సైతం పర్యవేక్షించారు. దీంతో కాంట్రాక్టర్లు ఆగమేఘాల మీద పనులు పూర్తి చేశారు. భవనాలు, పలు అభివృద్ధి పనులు పూర్తయినా సీఎం ముహూర్తం ఖరారు కాకపోవడంతో ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో శిథిలావస్థలో ఉన్న భవనాల్లోనే అధికారులు, పాలకులు కార్యకలాపాలు కొనసాగిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ( చదవండి: Snehalata Mogili: ప్రభుత్వ ఆస్పత్రిలో అదనపు కలెక్టర్‌ ప్రసవం )

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా.... 
► మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్, కేశవరం గ్రామాల్లో నిర్మించిన ఫంక్షన్‌హాల్‌లు, భవనాలు అందుబాటులోకి రాకపోడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. గ్రామాలకు దూరంగా ఈ భవనాలు నిర్మించడంతో మందుబాబులకు మంచి సిట్టింగ్‌ స్పాట్‌గా మారాయి.  
►  ఫంక్షన్‌హాల్‌లలో ఏర్పాటు చేసిన ఫ్యాన్లు, విద్యుత్‌ వైర్లు, స్విచ్‌లు వాడుకలోకి రాకముందే పూర్తిగా ధ్వంసమయ్యాయి. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన భవనాలు, ఫంక్షన్‌హాల్‌ల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసిన మద్యం సీసాలు, సిగరెట్‌ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. నిర్మానుష్య ప్రాంతం కావడంతో పోకిరీలు గంజాయి సైతం పీల్చుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 
►  ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ దత్తత మండలమైన మూడుచింతలపల్లికి సమయం కేటాయించి.. భవనాలను ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.  

శిథిలావస్థలో గ్రామపంచాయతీ భవనం
సీఎం దతత్త తీసుకున్న కేశవరం గ్రామపంచాయతీ భవనం శిథిలావస్థలో ఉంది. అందులో కార్యకలాపాలు కొనసాగించడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనాలు మళ్లీ పాడవుతున్నాయి. ఇకనైనా సీఎం కేసీఆర్‌ నూతన భవనాలను ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలి.
– నర్సింలు, కాంగ్రెస్‌ పార్టీ మూడుచింతలపల్లి మండల అధ్యక్షుడు 

వ్యామోహమంతా అధికారం మీదనే.. 
సీఎం కేసీఆర్‌కు అధికారం మీద ఉన్న మోజు ప్రజల సమస్యల ఉండదు. అసలు మూడుచింతలపల్లి మండలం తన దత్తత మండలమని గుర్తుందో లేదో. ప్రజాధనంతో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే భోగాలు అనుభవిస్తోంది. కాని ప్రజలకు మాత్రం సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యింది. ఎన్నికలు వచ్చినపుడే సీఎం కేసీఆర్‌కు ప్రజలు, అభివృద్ధి కార్యకమాలు గుర్తొస్తాయి. ఇకనైనా భవనాల ప్రారంభానికి సమయం కేటాయించాలి.
– సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, మేడ్చల్‌ జెడ్పీ కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ 

చదవండి: Tsrtc: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. ఆర్టీసీలో ‘పెళ్లి సందడి’

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top