NIMS Hospital: నిమ్స్‌ ఆసుపత్రికి లోకాయుక్త నోటీసులు

Hyderabad NIMS Annual revenue and Expenditure were incorrect Lokayukta issues notice - Sakshi

 నిమ్స్‌లో ఆదాయ వ్యయాలపై  కొరవడిన పర్యవేక్షణ 

ఆడిటింగ్‌ సరిగా లేదని  సంబంధిత శాఖ ఫిర్యాదు 

స్పందించిన లోకాయుక్త... నోటీసులు జారీ 

లక్డీకాపూల్‌: నిమ్స్‌ ఆస్పత్రికి తెలంగాణ లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. వార్షిక ఆదాయ వ్యయాలపై లెక్కలు సరిగా లేవని, ఆడిటింగ్‌కు సహకరించడం లేదని ఆడిట్‌ శాఖ ఈమేరకు లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. దీంతో నిమ్స్‌ లెక్కలపై డొల్లతనం బయటపడుతోంది.  

నిమ్స్‌లో ఆదాయం-వ్యయాలపై యాజ మాన్యం ఆజమాయిషీ ఉండడం లేదు. దీంతో చెల్లింపులు అడ్డగోలుగా జరుగుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ మేరకు ఒక అధికారికి ఒకే నెలలో రెండుమార్లు వేతనం జమ అయినట్లు తెలుస్తోంది. 
లాగే ఓ కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన రూ.5 లక్షలు రెండుమార్లు చెల్లించినట్లు తెలుస్తోంది. 
మ్యాన్‌పవర్‌ ఏజెన్సీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా సరిగా ఉండడం లేదు. ఇప్పటికి నాలుగుసారు ఈ–టెండర్లు పిలవడం..రద్దు చేయడం ద్వారా వృథా ఖర్చులు పెంచుతున్నారు.  
ఇక వార్షిక గణాంకాలను సక్రమంగా నిర్వహించని కారణంగా టీడీఎస్‌ రూపంలో నిమ్స్‌ ఖజానాకు గండి పడుతోంది. సరైన లెక్కలు చూపిస్తే.. ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో 10 శాతం నిధులు టీడీఎస్‌ రూపంలో మిగిలే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అలా జరగడం లేదు.  
 ఆస్పత్రికి ఏటా రూ.250 నుంచి 280 కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. ఈ నిధుల ఖర్చుపై నియంత్రణ లేదు. ఆజమాయిషీ..రోజు వారి లెక్కలు చూసే నాథుడే లేడు. 
 క్రమం తప్పకుండా లెక్కలు చూపితే.. టీడీఎస్‌ చెల్లించాల్సిన అవసరం ఉండదని, వాస్తవానికి ఆస్పత్రులకు టీడీఎస్‌ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని, నిమ్స్‌లో మాత్రం టీడీఎస్‌ చెల్లిస్తున్నారని ఓ సీనియర్‌ అధికారి వాపోయారు.  
 ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆడిట్‌ శాఖ లెక్కల విషయంలో నిమ్స్‌ అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా పరిగణించింది. ఆడిట్‌ నిర్వహణకు అధికారులు సహకరించడం లేదని ఆడిట్‌ అధికారిగా వ్యవహరిస్తున్న పి.కోటేశ్వరరావు యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. దానిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన (ఫిర్యాదు నెం.1771/14/బి1) లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో వచ్చే నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు జమాఖర్చుల నివేదికతో హాజరు కావాల్సిందిగా నిమ్స్‌ యాజమాన్యానికి లోకాయుక్త నోటీసు(నెం.1771/2014/బి1/లోక్‌/5571/2021) జారీ చేసింది. 

ఆడిట్‌ అధికారుల వైఫల్యమా? 
ఇదిలా ఉండగా ఆడిట్‌ అధికారుల వైఫల్యం కారణంగానే నిమ్స్‌ లెక్కల వ్యవహారం అస్తవ్యస్థంగా తయారైందని ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్‌ విభాగానికి చెందిన ఓ అధికారి ఆరోపించారు. ఆడిట్‌ చేసేందుకు ముందుకు రాకుండా నిమ్స్‌ లెక్కలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, ఇది ఎంత వరకు న్యాయమని ఆ అధికారి నిలదీయడం గమనార్హం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top