చెరువుల నిండా.. ఈ.కోలి! | Hyderabad Lakes Filed With Pollution And Masquitos | Sakshi
Sakshi News home page

చెరువుల నిండా.. ఈ.కోలి!

Aug 4 2020 7:53 AM | Updated on Aug 4 2020 7:53 AM

Hyderabad Lakes Filed With Pollution And Masquitos - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలవాల్సిన పలు చెరువులు కాలుష్య కాసారమౌతుండటంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి చేరుతున్న వ్యర్థజలాలతో చెరువులు దుర్గందభరితంగా మారుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తాజా పరిశీలనలో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే ఆయా చెరువుల్లో ఈ. కోలిఫాం, హానికారక బ్యాక్టీరియా ఉనికి అనూహ్యంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దోమల లార్వా భారీగా వృద్ధి చెందేందుకు అనుకూలంగా ఉండటంతో మహానగరంలో దోమలు విజృంభిస్తున్నాయి. ఈ దుస్థితి కారణంగా సిటీజన్లకు మలేరియా, డెంగీ వ్యాధుల ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

నిలువెల్లా కాలుష్యమే.. 
నగరానికి మణిహారంలా ఉన్న పలు చెరువులు రోజురోజుకూ కాలుష్యకాసారంగా మారుతున్నాయి. వీటి ప్రక్షాళనకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం విఫలం కావడం శాపంగా పరిణమిస్తోంది.  సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాలు మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేయకుండానే ఈ చెరువుల్లోకి చేరుతుండటంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గందభరితంగా మార్చేస్తున్నాయి. ప్రధానంగా మలమూత్రాదులు, వ్యర్థ జలాల్లో ఉండే ఫేకల్‌ కోలిఫాం, టోటల్‌ కోలిఫాం మోతాదు అధికంగా పెరిగినట్లు పీసీబీ తాజా పరిశీలనలో తేలింది. దీంతో ఆయా చెరువుల్లో హానికారక షిగెల్లా, స్టెఫైలోకోకస్, ఈ.కోలి వంటి బ్యాక్టీరియా ఉనికి పెరిగినట్లు స్పష్టమైంది. దీనికి తోడు ప్రస్తుతం కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదవుతుండటంతో  పలు చెరువుల్లో దోమల లార్వా అధికంగా వృద్ధి చెందుతోంది. దీంతో దోమలు ఆయా ప్రాంతాల్లో స్వైరవిహారం చేస్తున్నాయి.

ఈ దుస్థితికి కారణాలివే.. 
కూకట్‌పల్లి ప్రగతి నగర్‌ చెరువులో 2019తో పోలిస్తే 2020 సంవత్సరంలో ప్రతి వంద మి.లీ లీటరు నీటిలో 406 మైక్రో గ్రాముల మేర కోలిఫాం ఉనికి పెరిగింది. 
సమీప ప్రాంతాల మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరకుండా మినీ మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించడంలో జీహెచ్‌ఎంసీ విఫలం కావడంతో పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోంది. 
గత 20 ఏళ్లుగా పలు చెరువులు కబ్జాలకు గురవడం.. చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడటంతో మురుగు కూపమౌతున్నాయి. 
పలు చెరువులు వాటి ఎఫ్‌టీఎల్‌ పరిధిలో సగం భూములను కోల్పోయి కుంచించుకుపోతున్నాయి. 
చెరువుల ప్రక్షాళనకు జీహెచ్‌ఎంసీ పైపై మెరుగులకే ప్రాధాన్యతనిస్తోంది. ఉదాహరణకు కూకట్‌పల్లి అంబర్‌ చెరువులోకి సమీప ప్రాంతాల నుంచి భారీగా మురుగు నీరు నేరుగా వచ్చి చేరుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు.

ఈ ప్రాంతాల్లో దోమల దండయాత్ర... 
నగరంలోని అంబర్‌ చెర్వు, ప్రగతినగర్, కాప్రా, పెద్ద చెర్వు, సాయిచెర్వు, దుర్గంచెర్వు, నల్లచెర్వు, లక్ష్మీనారాయణ చెర్వులకు సమీపంలో ఉన్న కట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్, బాలానగర్‌ ప్రాంతాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలోని మెహిదీపట్నం, మసాబ్‌ట్యాంక్, చాదర్‌ఘాట్, కోఠి, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, అంబర్‌పేట్, ముషీరాబాద్, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.  

మూసీలోకి శుద్ధి చేయని వ్యర్థజాలాలు... 
మరోవైపు రోజువారీగా గ్రేటర్‌వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్‌ లీటర్ల వ్యర్థజలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్‌ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. మూసీ ప్రక్షాళన రెండోదశ పథకం కింద 10 చోట్ల ఎస్టీపీలు, మరో రెండు చోట్ల రీసైక్లింగ్‌ యూనిట్ల నిర్మాణానికి అవసరమైన రూ.1200 కోట్లు నిధులు విడుదల చేయడంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం శాపంగా పరిణమిస్తోంది. 

మలేరియా, డెంగీలతో తస్మాత్‌ జాగ్రత్త... 
ప్రస్తుత సీజన్‌లో దోమలు స్వైరవిహారం చేస్తుండడంతో డెంగీ, మలేరియా వ్యాధుల ముప్పు పొంచి ఉంది.  
గర్భిణులు, చిన్నారులు దోమలబారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గాలిలో వైరస్, బ్యాక్టిరియా వృద్ధికి దోహదం చేస్తున్నాయి.  
ప్రభుత్వ యంత్రాంగం యాంటీ లార్వా ఆపరేషన్స్‌ను మరింత పెంచాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement