చేప ప్రసాదం.. ఏర్పాట్లు ముమ్మరం | Hyderabad Fish Prasadam 2026 | Sakshi
Sakshi News home page

చేప ప్రసాదం.. ఏర్పాట్లు ముమ్మరం

Jun 6 2026 10:49 AM | Updated on Jun 6 2026 11:07 AM

Hyderabad Fish Prasadam 2026

రేపు సత్యనారాయణ స్వామి పూజలు  

8న ఉదయం ప్రసాదం తయారీ  

అదే రోజు రాత్రి 9 గంటల నుంచి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పంపిణీ  

హైదరాబాద్‌: మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో అస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడానికి బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. ఈ నెల 8న రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు రాత్రి వరకు కొనసాగుతుందని బత్తిని గౌరిశంకర్‌ గౌడ్‌ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటలకు దూద్‌బౌలిలోని స్వగృహంలో సత్యనారాయణ స్వామివ్రతం, బావి పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  8న ఉదయం చేప ప్రసాదాన్ని తయారు చేసిన అనంతరం దూద్‌బౌలిలోని స్వగృహంలో కుటుంబ సభ్యులంతా చేప ప్రసాదాన్ని తీసుకున్న అనంతరం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో  పంపిణీ ప్రారంభమవుతుంది. 

179 ఏళ్లుగా పంపిణీ  
చేప ప్రసాదానికి 179 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రతి ఏడాది పాతబస్తీ దూద్‌బౌలిలోని స్వగహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇక్కడి బావి నీటితో చేప ప్రసాదాన్ని తయారు చేస్తారు. పూర్వీకుల నుంచి 1996 వరకు పాతబస్తీ దూద్‌బౌలిలో పంపిణీ జరిగిన చేప ప్రసాదం వివిధ కారణాలతో 2013 నుంచి  ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోనే  కొనసాగుతూ వస్తోంది. ప్రసాదం పంపిణీకి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.   

50 కిలోల నుంచి 5 క్వింటాళ్ల వరకు.. 
మొదట్లో 50 కిలోల వరకు తయారు చేసిన ఈ చేప ప్రసాదం ప్రస్తుతం 5 క్వింటాళ్లకు చేరిందని అనిరుధ్‌ గౌడ్‌ తెలిపారు. మొదట్లో చేప మందుగా ప్రాచుర్యం పొంది అనంతరం చేప ప్రసాదంగా మారింది. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్‌ సైతం చేప ప్రసాదం కోసం తమ వద్దకు వచ్చారని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

మూడు రకాల చేప ప్రసాదం... 
చేప మందును మూడు రకాలుగా తయారు చేస్తారు. చేపతో ఇచ్చే మందు, బెల్లంతో ఇచ్చే మందు, కార్తె మందు. 2 నుంచి 3 అంగుళాల కొరమీను చేపతో ఇచ్చే ప్రసాదంలు 10 గ్రాములుంటుంది. 30 గ్రాములు కలిగిన కార్తె మందును మూడు డోసులుగా 45 రోజుల పాటు వాడాలి. 15, 30, 45 రోజలలో కార్తె మందును వాడాలి. చేపతో మింగడం ఇష్టం లేని వారికి బెల్లం ప్రసాదాన్ని అందజేస్తారు. నిజానికి చేపతో తీసుకునే ప్రసాదమే ఫలితాలిస్తుందని చెబుతున్నారు. ప్రసాదం స్వీకరించే ముందు రెండు గంటల వరకు ఎలాంటి ఆహార పదార్థాలతో పాటు నీటిని కూడా స్వీకరించకూడదు. ప్రసాదం స్వీకరించిన అనంతరం గంటన్నర వరకు కూడా స్వీకరించకూడదు.    


 

Advertisement
 
Advertisement
Advertisement