ఇటు కమలం, అటు గులాబీ.. ఫ్లవర్‌ అనుకుంటిరా..ఫైర్‌

Hyderabad: Fight Between Trs Party And Bjp Party In Telangana - Sakshi

బీజేపీ, టీఆర్‌ఎస్‌ సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కుతున్న రాజకీయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. టీఆర్‌ఎస్, బీజేపీ.. మాటల యుద్ధం ముదిరి పాకానపడుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, పరస్పర విమర్శలు, ఆరోపణలు, వ్యక్తిగత దూషణలతో సెగ రోజురోజుకూ పెరుగుతోంది. కొన్నాళ్లుగా రాష్ట్రం లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టుగా వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోళ్లు మొదలు, వ్యవసాయానికి విద్యుత్‌ మీటర్ల వరకు పలు అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

కేసీఆర్, స్టాలిన్‌తో కలిసి ముందుకు సాగుతామని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా మాజీ ప్రధాని, జనతాదళ్‌ (ఎస్‌) అధినేత దేవెగౌడ మంగళవారం కేసీఆర్‌కు ఫోన్‌ చేసి తన మద్దతు ప్రటించారు. బీజేపీపై దూకుడును కేసీఆర్‌ మరింత పెంచాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఇలావుండగా బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్‌కు దీటుగా స్పందిస్తూ ఎదురుదాడి చేస్తోంది. కేంద్ర మంత్రులు ఆర్కే సింగ్, కిషన్‌రెడ్డిలు మంగళవారం కేసీఆర్‌ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. మోదీ ఏడున్నరేళ్ల పాలనపై అమర వీరుల స్తూపం వద్ద కేసీఆర్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని కిషన్‌రెడ్డి ప్రకటించారు. కేసీఆర్‌ దివాలాకోరు, దిగజారుడు మాటలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని ఘాటుగా విమర్శించారు.

మరోవైపు రైతులకు ఎలక్ట్రిక్‌ మీటర్లు ఇవ్వాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తోందంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పని, అబద్ధమని ఆర్కే సింగ్‌ స్పష్టం చేశారు. కాగా కేసీఆర్‌ చర్చకు సిద్ధమన్న కిషన్‌రెడ్డిని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మీతో చర్చకు మా ఎమ్మెల్యే చాలంటూ చురకలంటించగా.. ఇన్నాళ్లూ రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎడమొహం పెడమొహంగా ఉన్న కోమరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఆధికారంలోకి తేవడానికి ఉమ్మడి పోరాటం చేస్తామనడం రాష్ట్ర రాజకీయాల్లో కొసమెరుపు.  

కేసీఆర్‌తో చర్చకు సిద్ధం

మా పార్టీని దేశం నుంచి వెళ్లగొట్టే శక్తి భూ మండలంలోనే ఎవరికీ లేదు.  ప్రధాని మోదీ ఏడున్నరేళ్ల పాలనలో ఏం చేశారన్న దానిపై సీఎం కేసీఆర్‌తో బహిరంగ చర్చకు నేను సిద్ధం.     – కిషన్‌రెడ్డి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై మంత్రి హరీశ్‌రావు మండిపాటు
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తి కిషన్‌రెడ్డి.  మీతో చర్చకు అంబర్‌పేట చౌరస్తాలో మా పార్టీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ చాలు.     – మంత్రి హరీశ్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top