డీ విటమిన్‌ బియ్యానికి పేటెంట్‌

Hyderabad Farmer Wins Patent For Enriched Rice And Wheat Variety - Sakshi

టెక్నిక్‌ కనుగొన్న తెలంగాణ రైతు, పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి

అంతర్జాతీయ ‘పేటెంట్‌ కో ఆపరేషన్‌ ట్రీటీ’ ధ్రువీకరణ

130 దేశాల్లో పేటెంట్లు పొందేందుకు మార్గం సుగమం.. ప్రభుత్వం కోరితే ఫార్ములా ఇస్తానని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: మట్టి సేద్యంతో ప్రసిద్ధి పొంది గత ఏడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్న తెలంగాణ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసే బియ్యం, గోధుమల్లో డీ విటమిన్‌ గణనీయమైన మోతాదులో ఉండేలా వినూత్న ఫార్ములాను రూపొందించారు. సాధారణంగా బియ్యం, గోధుమల్లో విటమిన్‌ డీ అంతగా ఉండదు. అయితే వెంకటరెడ్డి ఫార్ములా ప్రకారం రూపొందించిన ద్రావణాలను పంటపై పిచికారీ చేస్తే బియ్యం, గోధుమల్లో విటమిన్‌ డీ గణనీయమైన మోతాదులో వస్తుందని ఆయన చెబుతున్నారు. తన ఫార్ములాపై అంతర్జాతీయంగా పేటెంట్‌ కోసం గత ఏడాది దరఖాస్తు చేయగా, తాజాగా నోటిఫికేషన్‌ వెలువడింది. వెంకటరెడ్డి మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని అల్వాల్‌కు చెందిన ప్రముఖ ద్రాక్ష రైతు. ఆ

యన గతంలో ఆవిష్కరించిన ‘మట్టి సేద్యం’ఫార్ములాను దేశవ్యాప్తంగా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఉపయోగించుకుంటూ లబ్ధి పొందుతున్నారు. మట్టిని ఎరువుగా, పురుగులమందుగా, పంటనాణ్యతను పెంచేవిధంగా వాడుకోవటం ఎలాగో కనుగొన్నారు. దానికి చాలా ఏళ్ల క్రితమే 130 దేశాల్లో పేటెంట్‌ హక్కులు పొందారు. రసాయనాలు వాడకుండా, జన్యుమార్పిడి వంటి ఖరీదైన సాంకేతికతలు వాడనవసరం లేకుండానే ధాన్యం, గోధుమ పంటల్లో ఎక్కువ మోతాదులో విటమిన్‌ డి వచ్చేలా వెంకటరెడ్డి విజయం సాధించారు. బియ్యంలో విటమిన్‌ డీ సాధించిన ఫార్ములాకు పేటెంట్‌ హక్కు పొందడానికి అంతర్జాతీయ మేధో హక్కుల సంస్థ(డబ్లు్యఐపీవో) తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పేటెంట్‌ కోఆపరేషన్‌ ట్రీటీ (పీసీటీ) ధ్రువీకరణ ఇచ్చింది. అతని ఫార్ములాపై 130 దేశాల పేటెంట్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకొని జాతీయస్థాయి పేటెంట్‌ హక్కులు పొందడానికి అవకాశం ఏర్పడింది. 

రైతులకు అవగాహన కల్పిస్తా...
వరి సాగు సందర్భంగా ‘విటమిన్ ఏ’ను కలపడం, తద్వారా సూర్యరశ్మి దానికి తోడవడంతో ‘విటమిన్‌న్‌డీ’తో కూడిన వరి ధాన్యం ఉత్పత్తి అయిందని చింతల వెంకటరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. సీ విటమిన్‌¯తో కూడిన వరి, గోధుమలను ఉత్పత్తి చేయాలన్నా తన వద్ద అందుకు సంబంధించిన ఫార్ములా ఉందన్నారు. పోషకాలు, విటమిన్లు కలిగిన వరి, గోధుమలను పండించే ఫార్ములా తన వద్ద ఉందని, రైతులు వ్యక్తిగత అవసరాల కోసం కోరితే ఎలా పండించాలో చెప్తానని, వ్యాపార అవసరాల కోసమైతే తన వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు పండించిన డీ విటమిన్‌ బియ్యాన్ని అనేకమంది తీసుకెళ్లారని, కరోనా కాలంలో ఈ బియ్యానికి పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉందన్నారు. సూర్యరశ్మి అందక పట్టణ, నగరవాసులు విటమిన్‌ డీ లోపానికి గురవుతున్నారు. దీంతో అనేకమంది జబ్బుల బారిన పడుతున్నారని, డీ విటమిన్‌ లోపం తెలుసుకొని కొందరు మాత్రలు వాడుతున్నారని అన్నారు. 

ప్రభుత్వం కోరితే ఇస్తా
‘కేంద్ర ప్రభుత్వం దీన్ని రైతులకు ఇవ్వాలనుకుంటే సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను’అని వెంకటరెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి ఆసక్తి లేకపోతే, బహుళజాతి కంపెనీలకు ఇస్తానని చెప్పారు. వెంకటరెడ్డి వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందులను ఉపయోగించరు. సేంద్రియ వ్యవసాయం పద్ధతులు పాటించినందుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకున్నారు. రాష్ట్రంలో అనేకసార్లు మోడల్‌ రైతుగా అవార్డు పొందారు. 2001లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్, 2006లో జార్జ్‌బుష్‌లు హైదరాబాద్‌ సందర్శించినప్పుడు తన వ్యవసాయ పద్ధతులను వారి ముందు ప్రదర్శించారు. విత్తనరహిత ద్రాక్షలను ఆ ఇద్దరికీ బహుమతిగా ఇచ్చారు. 2003లో అతను వరి, గోధుమలపై ప్రత్యేక సాంకేతికతను పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టారు. సాధారణ పంట దిగుబడిని రెట్టింపు చేశారు. అతను సేంద్రియ ద్రాక్ష రకాన్ని బ్లాక్‌ బ్యూటీ సీడ్లెస్‌ ద్రాక్ష అని పిలుస్తారు. అల్వాల్‌లోని అతని ఐదు ఎకరాల ద్రాక్ష తోటలో 20 నుండి 25 టన్నుల దిగుబడి తీసుకొచ్చారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top