Hyderabad: ప్రయాణికులకు ఊరట.. పోలీసుల కీలక ఆదేశాలు

బుకింగ్ కాదంటే చలానా..
క్యాబ్, ఆటో డ్రైవర్లకు పోలీసుల హెచ్చరిక
సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం వేడుకలలో ఎలాంటి అపశ్రుతి దొర్లకుండా ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్లు, డ్రంకెన్ డ్రైవ్ (డీడీ) విస్తృత తనిఖీలు చేసేందుకు సిద్ధమయ్యారు. క్యాబ్‌లు, ట్యాక్సీ, ఆటో రిక్షాల డ్రైవర్లు సరైన యూనిఫాం, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాస్ సూచించారు.
ప్రయాణికులు రైడ్ బుక్ చేస్తే ఆపరేటర్లు నిరాకరించకూడదని, ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వాహన చట్టం–1988 సెక్షన్ 178 కింద ఉల్లంఘన కిందకే వస్తుందని, ఆయా డ్రైవర్‌కు ఈ–చలానా రూపంలో రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. డ్రైవర్లు అనుచితంగా ప్రవర్తించినా లేదా అదనపు చార్జీలు వసూలు చేసినా ప్రయాణికులు వాహనం, సమయం, స్థలం తదితర వివరాలతో 94906 17346 వాట్సాప్ నంబరులో ఫిర్యాదు చేయాలని సూచించారు. (క్లిక్ చేయండి: న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షల్లేవ్ )
సంబంధిత వార్తలు