Huzurabad Bypoll: వారిని ఖుషీ చేసేందుకు కోళ్లు, పొట్టేళ్లు డోర్‌ డెలివరీ

Huzurabad Bypoll Campaigning Goes New Way - Sakshi

పండుగపూటా ఎన్నికల ప్రచారమే 

స్థానికులకు ‘దసరా’ డోర్‌ డెలివరీ 

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కోళ్లు, పొట్టేళ్లు 

స్థానికేతరులకు రవాణా, భోజనం ఖర్చులు 

శనివారం నుంచి హోరెత్తనున్న ప్రచారం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. రాష్ట్రంలో పెద్దపండుగగా భావించే బతుకమ్మ, దసరా వేడుకలతో ప్రచారం కాస్త నెమ్మదించినా.. జనాలు ఎన్నికల మూడ్‌ నుంచి బయటకు రాకుండా నేతలు నానా తంటాలు పడుతున్నారు. పండుగల నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచారం చేయాల్సిన నేతలంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో సందడి తగ్గింది. అయితే, దీన్ని ముందే ఊహించిన పలుపార్టీల నేతలు ఎన్నికల వాతావరణం చల్లబడకుండా ఎవరికితోచిన ప్రయత్నాలు వారుచేస్తున్నారు. ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు పలు గ్రామాలు, వాడల్లో తమపార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.

దసరా నేపథ్యంలో ఓటర్లను ఖుషీ చేసేందుకు మేకలు, కోళ్లు డోర్‌ డెలివరీ చేసేస్తున్నారు. 10కుటుంబాలకు ఒక మేక లేదా పొట్టేలు చొప్పున ఇచ్చి అంతా కలిసి పంచుకోమంటున్నారు. స్థానిక చికెన్‌ సెంటర్లకు చెప్పి దసరారోజు తమ వారికి ఉచితంగా చికెన్‌ పంపిణీ అయ్యేలా సిద్ధం చేశారు. దసరా వేడుకల సందర్భంగా కొన్నిచోట్ల నాయకులే ప్రత్యేక విందులు, బతుకమ్మ వేడుకల వద్ద డీజేలు ఏర్పాటు చేశారు. ఇక దసరా రోజున తమ అనుకూలవర్గం అందరికీ చేరేలా మాంసంతోపాటు మ ద్యంబాటిళ్లను కూడా సరఫరాకు రంగం సిద్ధమైంది. అదే సమయంలో మహిళలకు చీరలు, ఇతర గృహోపకరణాలను పంచే యోచనలోనూ నేతలు ఉన్నారని సమాచారం.

చదవండి: (Huzurabad Bypoll: ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం)

స్థానికేతరులకు రవాణా, భోజనం..
ఈనెల 8వ తేదీన నామినేషన్ల పర్వం ముగియగానే ప్రచారం జోరందుకుంది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పొరుగు జిల్లాల నుంచి వచ్చిన అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు జోరుగా ప్రచారం నిర్వహించారు.
ఈ క్రమంలో వారికి రవాణా, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏర్పాట్లు చేశారు. పండక్కివెళ్లి అదే ఉత్సాహంతో తిరిగి వచ్చేందుకు దసరా ఖర్చులకు కూడా ఏర్పాట్లు చేశారు. కొందరు కార్యకర్తలు కాకుండా రోజుకూలీకి వచ్చేవారికి నియోజకవర్గం అవతల చెల్లింపులు జరిపారు.
ఇలా వస్తున్నవారికి రోజుకు భోజనం, రవాణా సదుపాయంతోపాటు రోజుకు రూ.300 వరకు ముట్టజెబుతున్నారని సమాచారం. మొత్తానికి దసరా పండుగ రోజు స్థానిక నేతలకు పనిభారం పెరిగింది. పండగరోజు కూడా ఓటర్లను కలుసుకోవడం, వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలోనే మునిగిపోయారు.

మద్యం, బహుమతుల పంపిణీపై పోలీసు నిఘా..!
హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో భాగంగా దసరా రోజున భారీగా మద్యం పంపిణీ జరక్కుండా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీములు, ఫ్లయింగ్‌ ఫ్లయింగ్‌ టీములతో పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తున్నారు.
ఇప్పటిదాకా  రూ.1,45,20,727 రూపాయల నగదును, రూ.1,50,000 విలువ గల 30 గ్రాముల బంగారం రూ.9,10,000 విలువ గల 14 కిలోల వెండిని, రూ. 5,11,652 విలువైన 867 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేసిన విషయం తెలిసిందే.
ఓటర్లను ప్రలోభపెట్టేలా ఎలాంటి చర్యలకు దిగినా వెంటనే కేసులు నమోదు చేస్తామని సీపీ సత్యానారయణ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఎక్కడ అలాంటి అనుమానాస్పద వేడుకలు జరిగినా డయల్‌ 100కు సమాచారమివ్వాలని సూచించిన విషయం తెలిసిందే.

శనివారం నుంచి హోరెత్తనున్న ప్రచారం..!
16వ తేదీ నుంచి హుజూరాబాద్‌లో ఉపఎన్నిక ప్రచారం హోరెత్తనుంది. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఇక మరింత దూకుడుగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే 17 వారాలుగా బీజేపీ– టీఆర్‌ఎస్‌ పార్టీలు నువ్వా–నేనా అన్న స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి. 9వ తేదీ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ కూడా రంగంలోకి దిగారు. 13, 14వ తేదీల్లో బతుకమ్మ, 15వ తేదీ దసరాతో ప్రచారం కాస్త నెమ్మదించింది. అయితే, 16వ తేదీ నుంచి అన్ని పార్టీలు స్పీడు పెంచనున్నాయి. 16వ తేదీ తరువాత స్టార్‌క్యాంపెయినర్లు కూడా రంగంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి జాతీయస్థాయి నేతలు, టీఆర్‌ఎస్‌ రాష్ట్రస్థాయి నేతలు ప్రచారబరిలో దూకనున్నారు. ఇకపై నేతల మాటల తూటాలతో హుజూరాబాద్‌ ఉపపోరు హోరెత్తనుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top