సిటీలో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు..

Hundreds Of Fake Doctors Are Circulating In Hyderabad City - Sakshi

నగరంలో దొంగ వైద్యుల భారీ దందా

ఎంబీబీఎస్‌స్పెషలిస్ట్‌లుగా చలామణి

నకిలీ సర్టిఫికెట్లతోజనానికి బురిడీ

ఇంటర్‌ చదివి ఎంబీబీఎస్‌గా చెలామణి అవుతున్నారు. కత్తెర పట్టి ఆపరేషన్లు చేసేస్తున్నారు. విచ్చలవిడిగా పెయిన్‌ కిల్లర్లు ఎక్కిస్తున్నారు. రోగం ఏదైనా హైడోస్‌ యాంటీ బయాటిక్‌లు ఇచ్చేస్తున్నారు. మొత్తంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు నకిలీ డాక్టర్లు. నగరంలో నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్లుగా మారిన వందలాది మంది వైద్యరంగంలో స్థిరపడి రూ.లక్షలు సంపాదిస్తున్నారు. గల్లీలు, బస్తీలు, కాలనీలే టార్గెట్‌గా దొంగ వైద్యులు క్లినిక్‌లు ఓపెన్‌ చేస్తున్నారు. అమాయకులైన నిరుపేదలను మోసం చేస్తూ వైద్యం పేరిట దండుకుంటున్నారు. గ్రేటర్‌ పరిధిలో వందకు పైగా నకిలీ డాక్టర్లు ఉన్నట్లు ఇటీవల వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదులు అందాయి. ఇంకా అనధికారికంగా మరో వంద మంది వరకు నకిలీ డాక్టర్లు ఉండొచ్చని అంచనా. ఫిర్యాదులు ఎక్కువవడంతో డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ దీనిపై విచారణకు ఆదేశించగా ఇప్పుడు నగరవ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్నాయి. 

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నకిలీ వైద్యులు హల్‌చల్‌ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్‌ ఫెయిలైన వారు సైతం ఎంబీబీఎస్‌ చేశామని చెప్పుకుంటూ క్లినిక్‌లు తెరుస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వార్డు బాయ్‌లుగా చేసిన వారు సైతం వైద్యుడి అవతారం ఎత్తుతున్నారు. ఆర్‌ఎంపీ, పీఎంపీ, ఎంబీబీఎస్‌ వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందిన విశ్వనగరంలో వందకుపైగా నకిలీ వైద్యులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖకు ఇటీవల ఫిర్యాదులు అందాయి. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు ఈ అంశంపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. మూడు రోజుల నుంచి నగరంలోని ఆయా క్లినిక్‌లలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, వారి వద్ద ఉన్న మెడికల్‌ సర్టిఫికెట్లు, ఓపీ, ఐపీ రిజిస్టర్లను పరీక్షిస్తున్నారు. అధికారులు తనిఖీలకు వస్తున్నట్లు తెలిసి..వీరిలో కొంతమంది క్లినిక్‌లకు తాళాలు వేసి.. తప్పించుకుని తిరుగుతుండటం గమనార్హం. 

పేదల బస్తీలే వీరి టార్గెట్‌... 
గ్రేటర్‌ శివారు ప్రాంతాల్లో పేదలకు ఎక్కువగా నివసించే బస్తీలను ఈ నకిలీ వైద్యులు టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఆరోగ్యంపై కనీస అవగాహన లేని వారికి హైడోస్‌ యాంటీబయాటిక్, పెయిన్‌ కిల్లర్‌ ఇంజెక్షన్లు, సిరప్‌లు ఇచ్చి ఎంతో హస్తవాసి ఉన్న వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఈ హైడోస్‌ మందులు వల్ల తాత్కాలికంగా నొప్పి నుంచి విముక్తి లభించినప్పటికీ...భవిష్యత్తులో కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ తర్వాత సీనియర్‌ వైద్యులు ఇచ్చిన మందులు కూడా పని చేయకుండా పోతున్నాయి. ఎల్బీనగర్, కర్మన్‌ఘాట్, బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, నాగోలు, బండ్లగూడ, యాంజాల్, ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్, మీర్‌పేట్, నాదర్‌గుల్, బోడుప్పల్, నారపల్లి, కీసరమండల పరిధిలోని రాజీవ్‌గృహకల్ప రోడ్, ఆల్విన్‌కాలనీ, నానక్‌రాంగూడ, కుషాయిగూడ, ఉప్పల్, కాప్రా, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్, రామంతాపూర్‌లలో వందకుపైగా నకిలీ వైద్యులు ఉన్నట్లు ఇటీవల ఫిర్యాదులు అందాయి. 

డీమ్డ్‌ యూనివర్సిటీల పేరుతో సర్టిఫికెట్లు.. 
తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న పలు డీమ్డ్‌ వర్సిటీల నుంచి వీరు సర్టిఫికెట్లు పొందుతున్నట్లు ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టైన వ్యక్తుల ద్వారా పోలీసులు గుర్తించారు. ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సులు చదవక పోయినా..ఆస్పత్రుల్లో, ఫార్మా కంపెనీల్లో పని చేసిన అనుభవంతో పేరుకు ముందు డాక్టర్‌ అనే ట్యాగ్‌ను తగిలించుకుంటున్నారు. క్లినిక్‌లకు వచ్చిన వారి నుంచి ఫీజు రూ.150 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. అవసరం లేకపోయినా సెలైన్లు ఎక్కించి రూ.వేలు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్కో నకిలీ వైద్యుడు రోజుకు సగటున 30 నుంచి 40 మందికి చికిత్స అందిస్తుండటం గమనార్హం.  

కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ క్రాస్‌ ప్రాక్టీస్‌ 
ఆయుర్వేద, యునానీ, హోమియోపతి కోర్సులు పూర్తి చేసిన వారికి సరైన ప్రాక్టీస్‌ లేదు. దీంతో వీరు అల్లోపతి వైద్యులుగా అవతారం ఎత్తుతున్నారు. ఈ వైద్యుల్లో ఉన్న బలహీనతను బస్తీల్లో వెలసిన క్లినిక్‌లు మాత్రమే కాదు..బడా కార్పొరేట్‌ ఆస్పత్రులు సైతం అవకాశంగా తీసుకుంటున్నాయి. అల్లోపతి వైద్యులతో పోలిస్తే..వీరి వేతనాలు కూడా చాలా తక్కువ. దీంతో వారిని డ్యూటీ డాక్టర్లుగా నియమించుకుంటున్నారు. వీరు కేవలం రాత్రి పూట మాత్రమే విధుల్లో ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన రోగి చెప్పిన విషయాలన్నీ రాసుకుని, క్రాస్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసినట్లు చెబుతున్న వారు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ పరీక్ష రాయకుండా ప్రాక్టీస్‌ చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వారు ఒక్క జియాగూడలోనే పది మంది వరకు ఉండటం గమనార్హం.    

నకిలీ వైద్యులపై కేసులు 
ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వారు తమ మెడికల్‌ సర్టిఫికెట్లను మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాతే ప్రాక్టీస్‌ ప్రారంభిస్తారు. వీరితో పెద్దగా సమస్య ఉండదు. చాలా మంది వివిధ వర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సంపాదించి గుట్టుచప్పుడు కాకుండా వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఇలాంటి నకిలీ వైద్యులపై చీటింగ్‌ కేసుతో పాటు డ్రగ్‌ అండ్‌ కాస్మొటిక్‌ యాక్ట్‌(1940) సెక్షన్‌ 27 సహా ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌ 1956 సెక్షన్‌ 15, 16ల కింద కేసు నమోదు చేస్తారు.   

వైద్యులు లేకపోవడం వల్లే.. 
జనాభాకు తగినట్లుగా వైద్యుల సంఖ్య లేదు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి పదివేల మందికి కనీసం 30 మంది వైద్యులు ఉండాలి. కానీ మన దేశంలో 1400 మందికి ఒక్కరే ఉన్నారు. దీనివల్ల నకిలీ డాక్టర్ల బెడద పెరిగింది. వెంటనే డాక్టర్‌పోస్టుల్ని భర్తీ చేయాలి. ప్రభుత్వం స్పందించి ప్రజారోగ్యాన్ని ప్రజలకు చేరువ చేయాలి. 
– డాక్టర్‌ శ్రీనివాస్, రెసిడెంట్‌ డాక్టర్, నిమ్స్‌ 

ప్రమాదకరం 
నకిలీ వైద్యులకు సరైన పరిజ్ఞానం లేక రోగికి ప్రమాదకరమైన మందులు ఇస్తున్నారు. ఇవి వారి ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. వీరు ఇచ్చే నొప్పి మాత్రలకు అలవాటుపడిన రోగులు చివరకు అవి లేకుండా నిద్రపోని పరిస్థితికి చేరుకుంటున్నారు. యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగించడం మంచిది కాదు. నకిలీ డాక్టర్లకు వెంటనే ముకుతాడు వేయాలి.
– డాక్టర్‌ లోహిత్‌ 

చదివింది ఇంటరే..
మీర్‌పేట టీఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన సాయికుమార్‌ ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి, సంతోష్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌గా చేరాడు. ఆ తర్వాత మీర్‌పేట క్రాస్‌రోడ్‌లో తానే స్వయంగా ఓ క్లినిక్‌ను ప్రారంభించాడు. తాను ఎంబీబీఎస్‌ వైద్యుడినని చెప్పుకుంటూ స్థానికులకు వైద్యం చేస్తున్నాడు. విషయం బయటకు పొక్కడంతో ఇటీవల ఆయన్ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

వైద్యుడి వద్ద అసిస్టెంటే..
తాను సీనియర్‌ వైద్యుడినని, ఎంతో మంది ఉన్నత వ్యక్తులు తనకు తెలుసని చెప్పుకుంటూ ఏకంగా పోలీసులనే బురిడీ కొట్టించాడు తేజ. బెంగళూర్‌లోని ఓ వైద్యుడి వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన ఇతడు.. మేడిపల్లిలో ఓ క్లినిక్‌ను తెరిచాడు. బస్తీవాసులకే కాకుండా పోలీసులకు సైతం వైద్యం చేశాడు. హోం ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్, పోస్టు కోవిడ్‌ బాధితులకు వైద్యసేవలు అందిస్తానని చెప్పి రాచకొండ పోలీసులను ఆశ్రయించి చివరకు మూడు నెలల క్రితం పట్టుబడ్డాడు.  

మైక్రోబయాలజీ స్టూడెంట్‌..
నారాయణగూడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంఎస్సీ మైక్రోబయాలజీ చదివిన ఒడిశాకు చెందిన సుప్రజిత్‌ పండా సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఉప్పల్‌ హనుమాన్‌ సాయినగర్‌ కాలనీలో అద్దెకు ఉంటున్న ఇంట్లోనే కమ్యూనిటీ కార్డియాలజీ సెంటర్‌ పేరుతో ఓ క్లినిక్‌ను తెరిచాడు. విదేశాల్లో డాక్టర్‌ కోర్సు చదివినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. ఆశించిన స్థాయిలో రోగులు రాకపోవడంతో వరల్డ్‌హెల్త్‌ ఆర్గనైజేషన్‌ పేరుతో ఎం.ఎస్‌ కార్డియాలజీ ఇన్‌ ఫెలోషిప్‌ ఐడీ కార్డును సృష్టించి ఏకంగా గాంధీ ఆస్పత్రిలో పట్టుబడ్డాడు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top