
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకుండా వైద్యం చేస్తున్న 8 మంది నకిలీ డాక్టర్లను గుర్తించినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ నగరంలోని బౌరంపేట్, దుండిగల్, సూరారం ప్రాంతాల్లో నకిలీ డాక్టర్లు యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటి అధిక స్థాయి మందులను రోగులకిచ్చి హాని కలిగిస్తున్నట్లు వచి్చన ఫిర్యాదుల మేరకు టీజీఎంసీ వైస్ చైర్మన్ డా.జి.శ్రీనివాస్, సభ్యుడు డా.విష్ణు బృందాలు దాడులు నిర్వహించాయి.
ఈ దాడుల్లో ఆరెంజ్ క్లినిక్ (ఎస్‌కే నాగులమీరా), బీఎల్‌ఆర్ క్లినిక్ (పి.సూర్యలత), నాని మినీ హాస్పిటల్ (కె.వెంకటేశ్), శ్రీ సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ (వై. సూర్యనారాయణ), శ్రీ శ్రీనివాస ఫస్ట్ ఎయిడ్ సెంటర్ (శివశంకర్), బాలాజీ క్లినిక్ (విట్టల్), నందీశ్వర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ (శంకర్ గౌడ్), మస్తాన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ (ఎస్‌కే.మస్తాన్)లలో అర్హత లేకపోయినా రోగులకు చికిత్సలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితులపై కేసులు నమోదు చేయనున్నట్లు డాక్టర్ జి. శ్రీనివాస్ తెలిపారు. నకిలీ వైద్యుల సమాచారం తెలిస్తే వాట్సాప్ నంబర్ 91543 82727 ద్వారా తెలియచేయాలని ఆయన ప్రజలను కోరారు.