
రోజుకు సగటున 10 లక్షల వాహనాల చక్కర్లు
ఇందులో లక్ష వెహికిల్స్ ఐటీ ఉద్యోగులవే..
గచ్చిబౌలి–మియాపూర్, హైటెక్ సిటీ–జేఎన్‌టీయూ, టోలిచౌకి–రాయదుర్గం మార్గాల్లో హెవీ ట్రాఫిక్
ఇతర రోజుల్లో కంటే మంగళ, బుధ, గురువారాల్లో 25 శాతం ట్రాఫిక్ ఎక్కువ
కార్ పూలింగ్, ప్రజా రవాణా వినియోగించడమే ఉత్తమం
ఊరికి పశ్చిమాన ఉన్నవి ఆ ప్రాంతాలు.. ఐటీ కారిడార్లు.. హైదరాబాద్‌కు తలమానికం.. నగరానికి మణిహారం.. ఐటీకి ఆలవాలం.. లక్షలాది ఉద్యోగులు.. దాదాపు అంతకు రెట్టింపు వాహనాలు.. వీఐపీల రాకపోకలతో బీజీ బీజీ.. ఇంతేనా! ఆ ప్రాంతాలు ఐటీ కారి‘డర్’కు.. ట్రా‘ఫికర్’కు కేరాఫ్ కూడా. వానొచ్చినప్పుడు చూడాలి వాటి సొగసు.. చినుకు పడితే వణుకే.. ప్రయాణమంటే ప్రయాసే.. అడుగుడుగునా అవస్థలే.. రహదారులన్నీ వాహనాల బారులే.. ఫ్లై ఓవర్లు ఉన్నా.. అండర్ పాస్‌లున్నా.. చాలా వెడల్పాటి రోడ్లున్నా.. తప్పని ట్రా‘ఫికర్’. నగరవాసికి నరకం చూపుతున్న ట్రాఫిక్ సమస్యపై ‘సాక్షి’ ప్రత్యేక కథనమిదీ..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ముఖ్యంగా ఐటీ సంస్థలు ఉండే పశ్చిమ హైదరాబాద్‌లో అయితే వాహన విస్ఫోటంతో నగరవాసికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఐటీ కారిడార్లలోని రహదారులపై రోజుకు 10 లక్షల వాహనాలు చక్కర్లు కొడుతుంటాయి. ఇలాంటి బిజీ రోడ్లపై తేలికపాటి వర్షాలకే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది.
హైదరాబాద్‌లో ఉన్న సుమారు 15 వేల ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో 9,05,715 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. చాలా ఐటీ సంస్థలు ఉద్యోగుల కోసం హైబ్రిడ్ విధానాన్ని అవలంబిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు వారంలో 2–3 రోజులు ఆఫీసు నుంచి, మిగిలిన రోజుల్లో ఇంటి నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే చాలా మంది ఐటీ ఉద్యోగులు వీకెండ్స్‌కు ముందు, తర్వాత రోజులైన శుక్ర, సోమవారాల్లో ఇంటి నుంచి పనిచేసేందుకే ఇష్టపడుతున్నారు. మంగళ, బుధ, గురువారాల్లో మాత్రం ఆఫీసులకు వస్తున్నారు. దీంతో సోమ, శుక్రవారాలతో పోలిస్తే మిగిలిన రోజుల్లో ఐటీ కారిడార్లలోని రహదారులపై వాహనాలు కిక్కిరిసిపోతున్నాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో వెల్లడైంది.
ఏ ఏ రోజుల్లో ట్రాఫిక్ జాం ఎక్కువంటే
సోమ, శుక్ర వారాలతో పోలిస్తే మంగళ, బుధ, గురువారాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇందులోనూ మంగళ, బుధవారాల్లో 20–25 శాతం, గురువారాల్లో 10–15 శాతం రోడ్లు వాహనాలతో బిజీగా ఉంటాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య రోడ్ల మీద వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి.
ఈ నాలుగు గంటలు నరకమే..
ఐటీ కారిడార్లలో రోజుకు 10 లక్షల ఆటోలు, బస్సులు, కార్లు, బైక్‌లు తిరుగుతుంటాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇక్కడ ప్రయాణించాలంటే వణుకే. ఈ నాలుగు గంటల్లో సుమారు లక్ష వాహనాల్లో ఐటీ ఉద్యోగులు ప్రయాణిస్తుంటారు. వారం మధ్య దినాల్లో ట్రాఫి క్ రద్దీ విపరీతంగా ఉంటుంది. సోమ, శుక్ర వారాల్లో ఐటీ ఉద్యోగులు హైబ్రిడ్ విధానంలో ఇంటి నుంచే పని చేస్తుండగా.. మంగళ, బుధ, గురువారాల్లో మాత్రం ఆఫీసులకు వెళుతున్నారు. దీంతో నివాస ప్రాంతాలతో అనుసంధానమై ఉండే ఐటీ కారిడార్లలో ట్రాఫిక్ రద్దీ 25 శాతం అధికం.

ప్రధానంగా ఈ రోడ్లు జాంజాం..
⇒ గచ్చిబౌలి–మియాపూర్ రోడ్
⇒ లింగంపల్లి వయా గచ్చిబౌలి రోడ్
⇒ హైటెక్ సిటీ–జేఎన్‌టీయూ వయా హఫీజ్‌పేట, కేపీహెచ్‌బీ
⇒ బొటానికల్ గార్డెన్ అండ్ కొత్తగూడ
⇒ టోలిచౌకి–రాయదుర్గం రోడ్ (షేక్‌పేట ఫ్లై ఓవర్)
కొత్తగా మరో 25 లక్షల గృహాలు..
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఏటా ఇచ్చే అనుమతుల్లో 60 శాతానికి పైగా భవన నిర్మాణ అనుమతులు ఐటీ కారిడార్లలోనే ఉంటాయి. అయితే ఆ మేరకు ఆయా రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగడం లేదు. భవిష్యత్తు అవసరాలను ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా ఇబ్బడిముబ్బడిగా అనుమతులు ఇస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వెస్ట్ హైదరాబాద్‌లో 30 అంతస్తులకుపైగా హైరైజ్ భవనాలు వందల సంఖ్యలో నిర్మాణమవుతున్నాయి. వచ్చే 4–5 ఏళ్లలో ఐటీ కారిడార్లలో కొత్తగా 25 లక్షల గృహాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఈ కారిడార్లలో నివాసముండే కుటుంబాల్లో ఇంటికి 2–3 కార్లు ఉంటున్నాయి. ఈ లెక్కన లక్షల వాహనాలు కొత్తగా రోడ్ల మీదికి వస్తాయి. ఇప్పుడున్న రద్దీనే తట్టుకోలేక చేతులెత్తేస్తున్న ప్రభుత్వ విభాగాలు భవిష్యత్తు పరిణామాల గురించి కూడా ముందస్తుగా ఆలోచిస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఏం చేయాలంటే..
⇒ ఎడతెరిపిగా వర్షాలు కురిసే రోజుల్లో ఐటీ సంస్థలు వేర్వేరు లాగిన్, లాగ్ అవుట్ వేళలను అవలంబించాలి.
⇒ సాధ్యమైనంత వరకు మెట్రో, ఎంఎంటీఎస్, బస్సులు వంటి ప్రజా రవాణాను ఉద్యోగులు వినియోగించేలా సంస్థలు ఆదేశించాలి.
⇒ ఒకే ప్రాంతం, ఒకే సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎవరికివారు సొంత వాహనాల్లో ఆఫీసులకు వెళ్లే బదులుగా ముగ్గురు, నలుగురు కలిసి ఒకే కారులో ప్రయాణించేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
⇒ కార్ పూలింగ్, బైక్ ట్యాక్సీ వంటి ప్రత్యామ్నాయ వాహన ఏర్పాట్లు చేసుకోవడం ఉత్తమం
⇒ యాజమాన్యాలు ఉద్యోగులకు ప్రతి రోజు ఆఫీసులో విధిగా నిర్వహించే మీటింగ్స్‌ను ఆన్‌లైన్ లేదా వర్చువల్ విధానంలో చేయడం ఉత్తమం.
⇒ ఐటీ కారిడార్లలో రోడ్లు, డ్రైనేజీల్లో చెత్తాచెదారం, సిమెంట్ కాంక్రీట్ వంటి వాటితో నిండిపోయి వర్షపు నీటి ప్రవాహ మార్గాలను అడ్డుకోకుండా మున్సిపల్, హైడ్రా, పోలీసులు సమన్వయంగా పనిచేయాలి.
⇒ హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులు వారంలో తప్పనిసరిగా మూడు రోజులు ఆఫీసుకు రావాలనేది యాజమాన్యాల నిబంధన. వానాకాలం, ఇతరత్రా అత్యవసర రోజుల్లో ఈ నిబంధనల్లో సడలింపులు ఇచ్చేలా సంస్థలను అధికారులు ఆదేశించాలి.
⇒ ఆఫీసు నుంచైనా, ఇంటి నుంచైనా ఉద్యోగుల పని వేళలు, ఉత్పాదకతలో ఎలాంటి మార్పులు లేనప్పుడు సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వడమే మేలు. దీంతో రహదారులపై ట్రాఫిక్ రద్దీ తగ్గడమేకాకుండా యాజమాన్యాలకూ ఉద్యోగుల రవాణా ఖర్చులు తగ్గుతాయి.

‘వీఐపీ’ల రాకపోకలు కూడా కారణమే..
గతంలో రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు ఇష్టపడేవారు. అయితే ఇప్పుడు ఆయా ప్రాంతాలు వాణిజ్య ప్రాంతాలుగా మారడంతో వారంతా కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, మాదాపూర్ (Madapur) వంటి పశ్చిమ హైదరాబాద్‌కు వలస వెళుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిరంతరం వీఐపీల కదలికల కారణంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. గతంలో సినిమా ఫంక్షన్లు ఎల్బీ స్టేడియంలో జరిగేవి. కానీ, ఇప్పుడు హైటెక్స్, హెచ్‌ఐసీసీ (HICC) వంటి ఐటీ కారిడార్లలోని ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఫలితంగా అభిమానుల తాకిడితో రోడ్లన్నీ స్తంభించిపోతున్నాయి. హెచ్‌ఐసీసీ, హైటెక్స్, నోవాటెల్, జేఆర్సీ, సంధ్య వంటి కన్వెన్షన్లలో నిత్యం ఏదో ఒక భారీ కార్యక్రమంఉంటుండటంతో ఐటీ కారిడార్లు బిజీ బిజీగా మారుతున్నాయి.
కుండపోతగా కురిసినప్పుడే సమస్య
వాన నీరు వెళ్లే మార్గాల పరిమాణం కంటే అధికంగా కుండపోత వర్షపునీరు వచ్చినప్పుడు రోడ్లన్నీ వరదతో నిండి ట్రాఫిక్ జాం అవుతున్నాయి. దీంతో వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద హైడ్రా (Hydraa), పోలీసులు సమన్వయంగా పనిచేస్తూ మోటార్లతో వరద నీటిని ఎత్తిపోస్తున్నాం. దీంతో కనీసం రెండు లైన్లు ట్రాఫిక్ క్లియర్ అవుతుంది.
– చంద్రశేఖర్ రెడ్డి, ఏసీపీ, మాదాపూర్
మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టే పరిష్కారం
బహుళ అంతస్తుల్లో నివాసం ఉండేందుకు కస్టమర్లు ఆసక్తి చూపుతున్నందున డెవలపర్లు కూడా హైరైజ్ ప్రాజెక్ట్‌లు ఎక్కువగా చేపడుతున్నారు. అయితే ఐటీ కారిడార్లలో ట్రాఫిక్ రద్దీకి సరైన పరిష్కారం మెట్రో, ఎంఎంటీఎస్‌ల విస్తరణ, మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగమే. ఆఫీసులు, విద్యాసంస్థలు వేర్వేరు పనివేళలను అమలు చేయాలి.
– జైదీప్ రెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ హైదరాబాద్