వికారాబాద్ జిల్లా: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో దాచిన రూ.20 లక్షల నగదు, బంగారం, వెండి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బండివాడలో శనివా రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అంజప్ప మేస్త్రీ పని చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఇటీవల తాము ఉంటున్న పాత ఇంటిని కూల్చేసి, నూతన గృహ నిర్మాణ పనులు ప్రారంభించాడు. ప్రస్తుతం పక్కనే చిన్న గుడిసె వేసుకుని భార్య, కొడుకుతో కలిసి ఉంటున్నారు. సొంత ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో మేడ్చల్ జిల్లా బొల్లారంలోని ప్లాటును విక్రయించారు. శుక్రవారం రూ.20 లక్షలు తీసుకొచ్చి గుడిసెలోని బీరువాలో దాచాడు. శనివారం ఉదయం అంజప్ప పనిమీద బయటకు వెళ్లగా కొడుకు స్కూల్ కు వెళ్లిపోయాడు. అంజప్ప భార్య అనిత బయట పనిచేస్తుండగా గుడిసెలోని ఫ్రిజ్ ఒక్కసారి పేలి పోయింది.
ఈ శబ్దం విన్న అనిత వెళ్లిచూడగా, మంటలు చెలరేగుతున్నాయి. గమనించిన చుట్టు పక్కల వారు నీళ్లు చల్లి ఆర్పేశారు. అప్పటికే గుడిసెలోని బీరువాకు మంటలంటుకున్నాయి. అందులో దాచిన రూ.20 లక్షల నగదు, ఐదు తులాల బంగారు, వెండి ఆభరణాలు కాలిపోయాయి. ఈ ఘటనతో బాధితులు లబోదిబోమంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై వేణుకుమార్ తెలిపారు.


