కొత్త ‘ఆతిథ్యం’

Hotel Sector Is Changing The Trend Robots Delivering Food At Restaurant - Sakshi

కోవిడ్‌ ఎఫెక్ట్‌.. మారిన హోటళ్ల తీరు 

కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు 

సరి‘కొత్తగా’ రోబోలతో స్వాగతం  

ఆహ్వానం నుంచి ఆరగించే వరకు.. 

భోజనప్రియులను ఆకట్టుకుంటున్న వైనం   

హుడా కాంప్లెక్స్‌: అతిథ్య రంగం ట్రెండ్‌ మారుతోంది.. కాలానుగుణంగా వినియోగదారుల అభి‘రుచుల’ మేరకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఏడాదిన్నర కాలంగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మనిషి జీవనశైలిలోనే కాదు ఆయా రంగంల్లోనూ పెను మార్పులు తీసుకువచ్చింది. ఆతిథ్యరంగంలో ఇప్పటివరకు అతిథులకు ఆహ్వానం పలికిన ఎగ్జిక్యూటివ్‌లు, ఆర్డర్‌ తీసుకొని ఆహార పదార్థాలను సరఫరా చేసే స్థానంలో ప్రస్తుతం రోబోలు రంగ ప్రవేశం చేశాయి. సాధారణ వెయిటర్‌ చేసే పనులను అలవోకగా చేస్తున్నాయి. ఇప్పటివరకు విదేశాల్లోనే లభిస్తున్న వీటి సేవలు మన వద్దకూ వచ్చాయి. ఇష్టమైన ఆహార పదార్థాలను ఆరగించడంతో పాటు.. అవి వడ్డించే రోబోలను ఆసక్తిగా తిలకిం చేందుకు కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారు.  

కోవిడ్‌కు దూరంగా.. వినూత్నంగా  
కోవిడ్‌ ఉధృతికి తోడు వరుస లాక్‌డౌన్‌లతో ఏడాదిన్నర కాలంగా  పారిశ్రామికంగా, వాణిజ్య పరంగా ఆతిథ్య రంగం కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అనేక మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వచ్చింది. మరోవైపు పుట్టినరోజు.. పెళ్లి రోజు.. ఇతర శుభ సందర్భాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లి కడుపు నిండా తిందామని భావించిన వారు కోవిడ్‌కు భయపడి వీటికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వినూత్నంగా ఏదైనా చేయాలని ఆలోచించాడు మలక్‌పేట్‌కు చెందిన మణికాంత్‌ గౌడ్‌. అలా రోబోలతో కొత్తగా రెస్టారెంట్‌కు శ్రీకారం చుట్టాడు.  

ఆర్డర్‌ మొదలు.. సప్లయ్‌ వరకు  
హోటల్‌కు వచ్చిన అతిథులకు కోవిడ్‌ సోకకుండా ఉండేందుకు సాధారణ మనుషుల స్థానంలో రోబోలను తీసుకువచ్చాడు. ఈ మేరకు కొత్తపేట్‌లో కొత్తగా రెస్టారెంట్‌ను తీర్చిదిద్దాడు. ప్రస్తుతం ఇక్కడ నాలుగు రోబోలు పని చేస్తున్నాయి. వచ్చిన అతిథుల నుంచి ఆర్డర్‌ తీసుకోవడం.. ఆర్డర్‌ను చెఫ్‌కు అందజేయడం.. ఆహార పదార్థాలు సిద్ధం కాగానే వాటిని అతిథులకు వడ్డించడం.. తిన్న తరువాత ప్లేట్లను తీసుకెళ్లడం.. శుభ్రం చేయడం.. కస్టమర్‌ ఇచ్చిన డబ్బులను తీసుకెళ్లి కౌంటర్‌లో జమ చేయడం లాంటి పనులన్నీ చకచకా చేసేస్తున్నాయి. మరోరోబో వచ్చి గెస్టులతో ముచ్చటిస్తుంది. వారికి బోరు కొట్టకుండా ఇష్టమైన సంగీతం, సాహిత్యం వినిపిస్తూ  అమితంగా ఆకట్టుకుంటోంది.  

నగరంలోనే తయారీ 
2019లో మాదాపూర్‌లో ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశా. ఇప్పటికే సికింద్రాబాద్‌లోని ఓ హైస్కూల్‌కు ఎడ్యుకేషన్‌ రోబోను ఇచ్చాం. ఇటీవల కొత్తపేట్‌లోని హోటల్‌కు రోబోలను సరఫరా చేశాం. తిరుపతి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, విజయవాడ, వైజాగ్, అహ్మదాబాద్, పుణే నుంచి సైతం ఆర్డర్లు వస్తున్నాయి. భవిష్యత్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగంలోను రోబోలను  ప్రవేశ పెట్టబోతున్నాం. వీటి ధర రూ.3 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుంది.  
– రామ్‌సింగం, సీఈఓ, ప్రైవేట్‌ లిమిటెడ్‌ 

రోబోలతో మంచి ఆదరణ   
నలుగురు మిత్రులం కలిసి వినూత్నంగా రెస్టారెంట్‌ తెరవాలని భావించాం. ఇప్పటికే మేం రోబోటిక్‌ కోర్సులను పూర్తి చేసి ఉండడంతో రోబోల తయారీ, పనితీరుపై అవగాహన ఉండటం కలిసి వచ్చింది. అలా రోబోలతో సరికొత్తగా రెస్టారెంట్‌ను మార్చేశాం. వీటిని చూసేందుకు చాలామంది వస్తున్నారు. కస్టమర్లు పెరిగారు. ఆదరణ చాలా బాగుంది.   
– మణికాంత్‌గౌడ్, రెస్టారెంట్‌ యజమాని, కొత్తపేట 

నైస్‌ థ్రిల్లింగ్‌  
ఏదైనా తిందామని కుటుంబసభ్యులతో కలిసి కొత్తపేటలోని రెస్టారెంట్‌కు వెళ్లాం. అక్కడ రోబోలను చూసి ఆశ్చర్యపోయాం. ఆర్డర్‌ తీసుకోవడం, సప్లయ్‌ చేయడం అచ్చం మనిషిలాగే చేస్తున్నాయి. నైస్‌ థ్రిల్లింగ్‌. వాటిని చూస్తూ.. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ.. నచ్చింది తింటూ ఎంజాయ్‌ చేశాం.    
– రాజ్యలక్ష్మి, ఎల్‌బీనగర్‌    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top