ఉదయం ఎండ.. సాయంత్రం ఠండా | Highest temperature recorded in Kumuram Bheem Asifabad District this summer | Sakshi
Sakshi News home page

ఉదయం ఎండ.. సాయంత్రం ఠండా

Apr 19 2026 5:50 AM | Updated on Apr 19 2026 5:50 AM

Highest temperature recorded in Kumuram Bheem Asifabad District this summer

కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కెరిమెరిలో 44.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత 

వివిధ జిల్లాల్లో వడదెబ్బకు ఇద్దరు వ్యవసాయ కూలీలు సహా నలుగురు మృతి 

సాయంత్రానికి చల్లబడ్డ వాతావరణం.. హైదరాబాద్‌ సహా పలుచోట్ల చిరుజల్లులు 

రెండ్రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం: ఐఎండీ

సాక్షి, హైదరాబాద్‌/ఎల్లారెడ్డి/మానవపాడు/మంథని రూరల్‌/బోయినపల్లి (చొప్పదండి): రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. శనివారం చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కెరిమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవగా నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌ మండలం బుట్టాపూర్‌లో 44.5 డిగ్రీలు, ఆదిలాబాద్‌ జిల్లా ఆదిలాబాద్‌ టౌన్‌లో 44.4 డిగ్రీలు, నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 44.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత రికార్డయింది. వివిధ జిల్లాల్లో వడగాడ్పులకు తాళలేక నలుగురు మృతిచెందారు.

మృతులను పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిన్న ఓదాల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ దాసరి రమేశ్‌ (45), రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన నల్లాల మోహన్‌ (46), జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కొర్వీపాడు గ్రామానికి చెందిన ఉపాధి కూలీ చిన్న ఊశన్న (63), కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అడివి లింగాలకు చెందిన రైతు లింగాల రాములు (59) మృతిచెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.  

అల్పపీడన ప్రభావంతో.. 
శనివారం సాయంత్రానికి వాతావరణం కాస్త చల్లబడింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రానున్న రెండ్రోజులు కూడా పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. అయితే గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని తెలిపింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement