శంకర్‌ భూమి కేటాయింపుపై హైకోర్టు విచారణ

High Court Trial On Land To Director Shankar Studio - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దర్శకుడు ఎన్‌. శంకర్‌కు భూమి కేటాయింపుపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. రూ.2.5 కోట్ల విలువ చేసే భూమిని రూ. 25 లక్షలకు ఎలా కేటాయిస్తారని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైదరాబాదులో ఇప్పటికే అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీ ఉందని, ఇతర వ్యక్తులకు స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వమే సొంతంగా సినిమా స్టూడియో నిర్మించవచ్చు కదా? అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలా విలువైన భూములను సినీ ప్రముఖుల పేరు చెప్పి కట్టబెట్టి.. ప్రభుత్వం ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదని హైకోర్టు పేర్కొంది. కేబినెట్ నిర్ణయాలకు సహేతుకత ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. (భూములను పల్లీల్లా పంచిపెడతారా?)

ఇక ధర్మాసనం వ్యాఖ్యలపై స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌.. కేబినెట్‌ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో శంకర్ కీలక పాత్ర పోషించారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఏబీ వ్యాఖ్యలతో ఏకీభవించని హైకోర్టు.. తెలంగాణ కోసం త్యాగం చేసిన వేల మందికి ఇలాగే  ఇస్తారా అని ప్రశ్నించించింది. దీనిపై మరోసారి కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి ఏజీ రెండు వారాల గడువు కోరాగా.. అనుమతించిన న్యాయస్థానం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా శంకర్‌కు తెలంగాణ ప్రభుత్వం భూమిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top