కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై హైకోర్టు ఆగ్రహం

High Court Serious On GHMC Over Boy Death In Stray Dogs Attack - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడి మృతి కేసుపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీ ఏం చేస్తోందని ప్రశ్నించింది. నష్టపరిహారం చెల్లింపు అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపిన కోర్టు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది.

విచారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించిన ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. కాగా గత ఆదివారం అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మరణించిన విషయం తెలిసిందే. పలు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.

అసలేం జరిగిందంటే...
నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండలానికి చెందిన గంగాధర్‌.. నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి అంబర్‌పేటలో నివాసముంటున్నారు. అంబర్‌పేటలోని ఓ కారు సర్వీసింగ్‌ సెంటర్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. గత ఆదివారం గంగాధర్‌ తన ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్‌తో కలసి తాను పని చేస్తున్న సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లారు. కుమారుడిని సర్వీస్‌ సెంటర్‌ లోపల ఉంచి తాను పనిచేసుకుంటున్నారు.

ప్రదీప్‌ ఆడుకుంటూ అక్క కోసం కేబిన్‌ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో చిన్నారి తల, కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన బాలుడి తండ్రి అక్కడికి వచ్చే లోపే చిన్నారి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top