సాక్షి, హైదరాబాద్: మరణించక ముందు వ్యక్తి చేసిన చట్టబద్ధమైన అప్పుల నుంచి వారసులు పూర్తిగా తప్పించుకోలేరని హైకోర్టు స్పష్టం చేసింది. తండ్రి లేదా ముందు తరం వారు చేసిన అప్పుల బాధ్యత, వారసత్వంగా వచ్చిన ఆస్తులపై కొనసాగుతుందని స్పష్టం చేసింది. రెవెన్యూ రికవరీ చట్టం కింద అధికారుల చర్యలు చట్టబద్ధమేనని చెబుతూ, కామారెడ్డి జిల్లాకు చెందిన యశోద దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. యశోద భర్త జలాల్‌పూర్ బ్రాంచ్ పోస్టుమాస్టర్‌గా పనిచేసే సమయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధుల్లో రూ.14.89 లక్షలు అక్రమంగా మళ్లించినట్లు ఆరోపణలొచ్చాయి.
దీనిపై విచారణ జరిపిన అధికారులు అక్రమ వినియోగం జరిగినట్లు నిర్ధారించి, ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జలాల్‌పూర్‌లోని వ్యవసాయ భూములను జప్తు చేసి వేలం వేయడానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ యశోద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..ఆ భూములు యశోద భర్త సంపాదించినవి కాదని, పూర్వీకుల నుంచి సంక్రమించిన వారసత్వ ఆస్తులని చెప్పారు.
పిటిషనర్‌తోపాటు ఆమె ఇద్దరు కుమారులు కూడా ఆ ఆస్తులపై హక్కుదారులన్నారు. భర్త చేసిన అప్పులకు మొత్తం భూమిని వేలం వేయడం చట్టవిరుద్ధమని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. హిందూ వారసత్వ చట్ట సవరణలపై స్పష్టత ఇచ్చారు. 2005 సవరణతో ‘పయస్ అబ్లిగేషన్’(తండ్రి అప్పులు తీర్చాల్సిన పుత్ర ధర్మం) సిద్ధాంతంలో మార్పులు వచ్చి నా, మరణించిన వ్యక్తి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తుల నుంచి మాత్రం బకాయిల చెల్లింపు బాధ్యత కొనసాగుతుందన్నారు. పిటిషనర్ స్వయంగా భూమి పూర్వీకుల ఆస్తేనని అంగీకరించిన తర్వాత, రికవరీ చర్యలను ప్రశ్నించలేరని తేల్చిచెప్పారు.


