వానలతో జ్వరాల ‘వరద’

Heavy Rains Floods: Be Alert Minister Harish Rao Tells Health Officials - Sakshi

సీజనల్‌ వ్యాధుల దడ

వర్షాలు, వాతావరణ మార్పులతో పెరిగిన జ్వరాలు 

ఒకవైపు డెంగీ, మరోవైపు కోవిడ్‌ కేసులు 

నివారణ చర్యలపై వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి

సమీక్ష నిర్వహించిన మంత్రి హరీశ్‌రావు 

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఏర్పడిన వాతావరణ మార్పులతో అనేక మంది జలుబు, దగ్గు, జ్వరం, తీవ్రమైన తలనొప్పి తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రధానంగా డెంగీ, మలేరియా, కరోనా ప్రజలను పట్టిపీడిస్తు న్నాయి. దీంతో బాధితులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. డెంగీ, కరోనా సోకినవారికి దాదాపు ఒకే రకమైన లక్షణాలు ఉండటంతో ఏది ఏ వ్యాధో అంతుచిక్కక జనం ఆందోళన చెందుతున్నారు.

కరోనా కేసులు కూడా 10 రోజుల నుంచి రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రోగ లక్షణాలు కనిపించిన వెంటనే ఆయా వ్యాధులను నిర్ధారించుకుని చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో వైరల్‌ ఫీవర్లు, జలుబు, శ్వాసకోశ సంబంధ కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా డెంగీ, కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

జిల్లాల్లో ఇప్పుడిప్పుడే డెంగీ కేసులు వస్తున్నట్టు తెలుస్తోంది. రాబోయే కాలంలో సీజనల్‌ వ్యాధులు. కోవిడ్‌ నుంచి కాపాడుకోవడానికి ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలతోపాటు ప్రజలు కూడా వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలని వైద్యు లు కోరుతున్నారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటే డెంగీ పరీక్ష చేయించుకోవాలి. కొద్దిగా విరేచనాలు, ముక్కు కారడం, గొంతులో గరగర ఉంటే కరోనా అయ్యే అవకాశమున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.

డెంగీ, కరోనాకు వేరు వేరు గా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇవి రెండూ ఒకే సారి కూడా వచ్చే అవకాశముంది. దీంతో పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ ఈ నెల మొదటి వా రంలో సర్వే మొదలు పెట్టింది. రాష్ట్రంలో చెత్త, చెదారం, నిల్వనీరు తొలగించడం ద్వారా సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు. మూడేళ్ల తర్వాత డెంగీతో ఆస్పత్రుల్లో చేరే రోగులు పెరిగినట్లు డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో 2019లో 13 వేలకు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 800 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. 

అప్రమత్తంగా ఉండాలి: మంత్రి హరీశ్‌రావు 
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వర్షాల కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్ధతతో ఉండాలని సూచించారు. సోమవారం ఆయన అన్ని జిల్లాల వైద్యాధికారులు, ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, విభాగాధిపతులు, వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఆయా జిల్లాల్లోని పరిస్థితుల గురించి ఆరా తీశారు. సబ్‌సెంటర్‌ స్థాయి నుంచి జిల్లా ఆస్పత్రి వరకు వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, పంచాయతీరాజ్, మున్సిపల్‌ తదితర శాఖ లతో సమన్వయం చేసుకుంటూ సేవలు అందించా లని సూచించారు. 108 వాహ నాలు వెళ్లలేని ప్రాంతాలను ముందే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలన్నారు.

హౌస్‌సర్జన్లు, జూనియర్‌ డాక్టర్లు, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లుసహా డైట్, పారిశుధ్య సిబ్బందికి సకాలంలో వేతనాలు అందే విధంగా బిల్లులు çసమర్పించాలని మంత్రి ఆదేశించారు. కాగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందించే మందుల సంఖ్య 720 నుంచి 843కు పెరిగింది. ప్రతి డాక్టర్‌కు ఈ జాబితాలోని మందుల వివరాలు తెలిసేలా బుక్‌లెట్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top