ఎంబీబీఎస్‌ సీట్లలో తెలంగాణ మేటి

Hairsh Rao Comments On MBBS seats in Telangana - Sakshi

ప్రతి లక్ష జనాభాకు 19 సీట్లున్నాయి: మంత్రి హరీశ్‌ 

929 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లకు నియామకపత్రాలు అందజేత 

సాక్షి, హైదరాబాద్‌/మాదాపూర్‌: ఎంబీబీఎస్‌ సీట్ల విషయమై దేశంలోనే తెలంగాణ ముందువరుసలో ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ తర్వాతి స్థానాల్లో కర్ణాటక(17), తమిళనాడు(15), గుజరాత్‌(10), మహారాష్ట్ర(9) సీట్లు ఉన్నాయన్నారు.

తలసరి పీజీ సీట్లలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో ఉందని, ప్రతి లక్ష జనాభాకు 2.77 మంది పీజీ డాక్టర్లు తయారవుతున్నారని, అతి త్వరలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలుస్తుందని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖలో కొత్తగా నియమితులైన 929 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లకు మంత్రి హరీశ్‌ శనివారం నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలను అందించాలని, బదిలీల కోసం ప్రయత్నం చేయొద్దని కోరారు. 81 వేల నియామకాలు చేపడతామని ముఖ్యమంత్రి చెప్పారని, మీరే మొదటి రిక్రూట్‌మెంట్‌ అని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వైద్య, ఆరోగ్యశాఖలో ఇప్పటివరకు 21,202 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, మరో 10వేల ఉద్యోగాలు భర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 17కు చేర్చగలిగామని, ఎంబీబీఎస్‌ సీట్లను 6,615 సీట్లకు పెంచగలిగామని పేర్కొన్నారు.

రానున్న రెండేళ్లలో ఏడాదికి 8 చొప్పున ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రారంభిస్తామని, దీంతో ప్రతి జిల్లాకో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలు ఏర్పాటు చేసినట్లు అవుతుందని అన్నారు. తల్లిజన్మ ఇస్తే.. పునర్జన్మ ఇచ్చే అవకాశం కేవలం డాక్టర్లకే ఉంటుందన్నారు.  

గొప్ప డాక్టర్లుగా పేరుపొందాలి 
గ్రామీణులకు, పేదలకు మంచి వైద్యం అందించి గొప్ప డాక్టర్లుగా పేరు పొందాలని, ప్రజల మన్నలను పొందాలని మంత్రి హరీశ్‌ ఆకాంక్షించారు. మెడికల్‌ సర్వీసెస్‌లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని నీతి ఆయోగ్‌ చెప్పిందని, దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణను నిలిపేందుకు అందరం కలిసి కృషి చేద్దామన్నారు.

కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీపీహెచ్‌ శ్రీనివాసరావు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతామహంతి, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ కుమార్, మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top