బీజేపీలో గ్రూపుల గోల.. 

Group politics In Nizamabad District BJP - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లా బీజేపీలో గ్రూపుల గోల వేడి పుట్టిస్తోంది. ధర్మపురి అర్వింద్‌ గత ఎన్నికల్లో కల్వకుంట్ల కవితను ఓడించి పార్లమెంటు సభ్యుడిగా వచ్చారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలు గతంలో కంటే మరింత స్పీడందుకున్నాయి. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడికి అనుగుణంగా పార్టీ కార్యకలాపాలు ఎంత మేరకు పెరుగుతున్నాయో, అదేవిధంగా గ్రూపులు సైతం ఏర్పడ్డాయి. 

జిల్లా కేంద్రమైన నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా ఎంపీ అర్వింద్‌ గ్రూపుగా ఉన్నారు. ధన్‌పాల్‌ సైతం పార్టీ తరపున అనేక కార్యక్రమాలు చేపట్టడంలో ముందంజలో ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో టిక్కెట్టు రేసులోనూ ముందున్నారు. అయితే ఇక్కడ ఎంపీకి వ్యతిరేకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే యెండల లక్షి్మనారాయణ ప్రత్యేక గ్రూపుగా ఉండగా, గత కొన్ని నెలల వరకు ఎంపీ వర్గీయుడిగా ఉన్న జిల్లా అధ్యక్షుడు బస్వా లక్షి్మనర్సయ్య తాజాగా యెండల గ్రూపులో చేరిపోయాడు. 

ఆర్మూర్‌ నియోజకవర్గం విషయానికి వస్తే సీనియర్‌ నాయకుడు లోక భూపతిరెడ్డి తటస్థంగా ఉండగా, రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, అల్జాపూర్‌ శ్రీనివాస్, నియోజకవర్గ నాయకుడు కంచెట్టి గంగాధర్‌ ఎంపీ వర్గంలో ఉన్నారు. ప్రొద్దుటూరి వినయ్‌రెడ్డి యెండల లక్షి్మనారాయణతో చేరారు. బాల్కొండ నియోజకవర్గంలో ఇన్‌చార్జి ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి ఎంపీ వర్గంలో ఉండగా, రుయ్యాడి రాజేశ్వర్, పెద్దోళ్ల గంగారెడ్డి యెండలతో చేతులు కలిపారు. బోధన్‌ నియోజకవర్గంలో నాయకులు మేడపాటి ప్రకాష్‌రెడ్డి, వడ్డి మోహన్‌రెడ్డిలు ఎంపీ వర్గంలో ఉన్నారు. 

కాగా బోధన్‌ టిక్కెట్‌ కోసం యెండల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ కులాచారి దినేష్‌ ఎంపీ వర్గీయుడిగా ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గానికి చెందిన ఓ జాతీయ పార్టీ నేత బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ అరి్వంద్‌ ద్వారా రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top