ప్రైవేట్‌ ఆసుపత్రులకు... భారీగా అనుమతులు 

Green Signal To Another 20 Hospitals For Corona Treatment - Sakshi

కరోనా చికిత్సకు మరో 20 ఆసుపత్రులకు గ్రీన్‌సిగ్నల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌లో కరోనా చికిత్స చేసే ఆసుపత్రుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. విరివిగా ఆసుపత్రులకు అనుమతి ఇవ్వాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో జిల్లాల్లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రైవేట్‌ ఆసుపత్రులను ప్రోత్సహిస్తున్నారు. ఒక్క రోజులోనే మరో 20 ఆసుపత్రులకు వైద్య, ఆరోగ్యశాఖ అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు 204 ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అందుబాటులో ఉండగా, మంగళవారం వాటి సంఖ్య 224కి చేరినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన కరోనా బులెటిన్‌ విడుదల చేశారు. దాని ప్రకారం ఆయా ఆసుపత్రుల్లో కరోనా పడకల సంఖ్య 10,733 నుంచి 11,288కి పెరిగాయి. త్వరలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా వైద్యాన్ని తీసుకొచ్చే అవకాశం ఉండటంతో అనేక ప్రైవేట్‌ ఆసుపత్రులు కరోనా చికిత్స చేసేందుకు విరివిగా దరఖాస్తు చేసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు పల్లెలపై కరోనా పంజా విసురుతుండటంతో ప్రజలకు ప్రైవేట్‌ వైద్యం అందుబాటులోకి తెస్తున్నట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. 

కోలుకున్నవారు నాలుగింతలు పైనే... 
కరోనా నుంచి కోలుకుంటున్న బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మంగళవారం నాటికి రాష్ట్రంలో 1,62,844 కేసులు నమోదయ్యాయి. వాటిల్లో ప్రస్తుతం 30,401 మంది చికిత్స పొందుతుండగా, 996 మంది చనిపోయారు. 1,31,447 మంది కోలుకున్నారు. అంటే ప్రస్తుతం చికిత్స పొందుతున్న కేసులతో పోలిస్తే కోలుకున్నవారు నాలుగింతలు పైనే ఉన్నారు. చికిత్స పొందుతున్నవారిలో 23,569 మంది హోం లేదా ఇతరత్రా ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక తెలంగాణలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 22,76,222కి చేరినట్లు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఇక ప్రతీ 10 లక్షల జనాభాకు 61,310 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు.   

ఒక్క రోజులో 2,273 కరోనా కేసులు...  
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం 55,636 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,273 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,62,844కి చేరింది. ఒక్కరోజే కరోనాతో 12 మంది మృతి చెందారు. అలాగే తాజాగా 2,260 మంది కోలుకున్నారు. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 325, రంగారెడ్డి జిల్లాలో 185, నల్లగొండలో 175, మేడ్చల్‌లో 164, కరీంనగర్‌లో 122, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 114 కేసులు నమోదైనట్లు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top