
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు హరితహారం తరహాలోనే తమిళనాడు గ్రీన్ మిషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 33% పచ్చదనం సాధించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర అదనపు ప్రభుత్వ కార్యదర్శి సుప్రియా సాహు తెలిపారు. ‘హరితహారం’కార్యక్రమం అధ్యయనానికి సుప్రియా సాహు నేతృత్వంలో తమిళనాడు అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించింది.
ఇందులోభాగంగా శనివారం అరణ్యభవన్‌లో అటవీ శాఖ స్పెషల్ సీఎస్ ఎ.శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. హరితహారం అమలు, ఫలితాలపై పీసీసీఎఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హరితహారం కార్యక్రమాన్ని ఎనిమిదేళ్లుగా అమలు చేస్తూ తెలంగాణ అద్భుత ఫలితాలు సాధించిందని సాహు కొనియాడారు.
నర్సరీల నిర్వహణతో పాటు, పచ్చదనం పెంచిన తీరు బాగుందని, అవెన్యూ ప్లాంటేషన్ (రహదారి వనాలు), అర్బన్ ఫారెస్ట్ పార్కులు, ఔటర్ వెంట పచ్చదనం తీర్చిదిద్దిన విధానం బాగుందని అభినందించారు. పర్యటనలో సాహు తీసిన ఫోటోలు, వీడియోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. సాçహు వెంట తమిళనాడు సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి ఆనంద్ ఉన్నారు. క్షేత్ర పర్యటనలో చీఫ్ కన్జర్వేటర్ (సోషల్ ఫారెస్ట్రీ) రామలింగం, రంగారెడ్డి, మేడ్చల్ డీఎఫ్‌ఓలు జాదవ్ రాహుల్ కిషన్, జానకి రాములు పాల్గొన్నారు.