టీఎస్‌ఎస్‌పీ అభ్యర్థులకు శుభవార్త

Good news for TSSP candidates - Sakshi

నవంబర్‌ 9 నుంచి పది కేంద్రాల్లో శిక్షణ ప్రారంభం 

తొలుత ఈ నెల 26 నుంచి కరోనా పరీక్షలు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ (టీఎస్‌ఎస్‌పీ) కొలువులకు ఎంపికై, దాదాపు ఏడాది నుంచి శిక్షణ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. నవంబర్‌ 9 నుంచి వీరికి శిక్షణ ప్రారంభంకానుంది. ఈ మేరకు తొలుత ఈ నెల 26 నుంచి కరోనా పరీక్షలకు హాజరుకావాలని అభ్యర్థుల మొబైళ్లకు టీఎస్‌ఎస్‌పీ నుంచి సంక్షిప్త సందేశాలు వచ్చాయి. దీంతో 3,963 మంది అభ్యర్థుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. షెడ్యూల్‌ ప్రకారం.. అంబర్‌పేట, మేడ్చల్, కరీంనగర్, పోలీసు ట్రైనింగ్‌ కాలేజీ (పీటీసీ)ల్లో తొలుత వీరికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్‌ వస్తే శిక్షణ కేంద్రాలకు, పాజిటివ్‌ వస్తే అక్కడే తాత్కాలిక క్వారంటైన్‌లో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. వీరి శిక్షణ కోసం ఇప్పటికే మొదటి, మూడవ, ఏడవ, ఎనిమిదవ, 10వ, 13వ, 17వ బెటాలియన్లతోపాటు పీటీసీ వరంగల్, పీటీసీ మేడ్చల్‌తో కలిపి మొత్తం పది కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. 

ఏడాది నిరీక్షణ ఫలితం.. 
వాస్తవానికి 2018లో సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వుడ్‌(ఏఆర్‌), టీఎస్‌ఎస్‌పీ విభాగాల్లోని దాదాపు 16వేల కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది. 2019 సెప్టెంబర్‌ నాటికి పరీక్షలు, ఫలితాల విడుదల పూర్తయ్యాయి. సివిల్, ఏఆర్‌ విభాగాలకు ఎంపికైన అభ్యర్థులకు 2020 జనవరి 17న శిక్షణ మొదలైంది. మౌలిక సదుపాయాలు సరిపడా లేకపోవడం, మార్చిలో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా టీఎస్‌ఎస్‌పీ అభ్యర్థుల శిక్షణ మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఈలోగా సివిల్, ఏఆర్‌ కానిస్టేబుళ్ల తొమ్మిది నెలల శిక్షణ పూర్తయ్యింది. వారికి పోస్టింగులు కూడా దాదాపు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో ఏడాది తరువాత తమకు ఎట్టకేలకు శిక్షణకు పిలుపురావడంపై టీఎస్‌ఎస్‌పీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శిక్షణకు ఇంకా ఎనిమిది రోజులే ఉండటంతో అభ్యర్థులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఉన్నతాధికారులు సూచించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top