‘ఘన్‌శ్యామ్‌దాస్‌’ కేసులో ఈడీ దూకుడు.. ఆస్తుల జప్తు

Gold Smuggling Case: ED Attached Assets worth Rs 25 Cr of Hyd Jeweller Family - Sakshi

ముగ్గురికి చెందిన ఆస్తులు తాత్కాలిక జప్తు

అటాచ్‌ చేసిన వాటిలో విల్లాలు, 54 కేజీల పసిడి 

సాక్షి, హైదరాబాద్‌: విదేశాలకు ఎగుమతి చేయాల్సిన బంగారాన్ని దారి మళ్లించి దేశీయ విపణిలో విక్రయించిన ఆరోపణలపై ఘన్‌శ్యామ్‌దాస్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెల్స్‌ సహా మరికొన్ని సంస్థలపై నమోదు చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కొరడా ఝుళిపించింది. ఈ ఏడాది మార్చిలో నమోదైన కేసుకు సంబంధించి ముగ్గురికి చెందిన రూ. 25.28 కోట్ల విలువైన ఆస్తుల్ని బుధవారం తాత్కాలిక జప్తు చేసింది. సంజయ్‌ కుమార్‌ అగర్వాల్, రాధిక అగర్వాల్, సంజయ్‌ కుమారుడు ప్రీత్‌ కుమార్‌ అగర్వాల్‌కు చెందిన ఖరీదైన విల్లాలతో పాటు 54 కేజీల బంగారం ఎటాచ్‌ చేసిన వాటిలో ఉన్నాయి.  

►అబిడ్స్‌ కేంద్రంగా కార్యకలాపాలు నడిపే ఘన్‌శ్యామ్‌దాస్‌ సంస్థను సంజయ్‌ కుమార్‌ నిర్వహిస్తున్నారు. ఈయనతో పాటు ఇతరులూ విదేశాలకు ఎగుమతి చేసే నెపంతో నకిలీ పత్రాలు సృష్టించి ఎంఎంటీసీ, స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, డైమండ్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థల నుంచి 250 కేజీల బంగారం ఖరీదు చేశారు.  

►ఎక్స్‌పోర్ట్‌ చేసే పసిడిపై కస్టమ్స్‌ సుంకం లేకపోవడాన్ని వీళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ మొత్తం బంగారాన్నిదారి మళ్లించి దేశీయ విపణిలోనే విక్రయించేశారు. దానికి సంబంధించన నగదు లావాదేవీలన్నీ హవాలా రూపంలో సాగించారు.

►కోల్‌కతాకు చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఈ విషయం గుర్తించారు. 2018 ఏప్రిల్‌ 4న ప్రీత్‌ కుమార్‌ అగర్వాల్‌ను కోల్‌కతా విమానాశ్రయంలో పట్టుకున్నారు. అప్పటికే సంజయ్‌ అగర్వాల్‌ హైదరాబాద్‌ రావడానికి ఇండిగో సంస్థకు చెందిన విమానం ఎక్కేశారు. దీన్ని గుర్తించిన డీఆర్‌ఐ అధికారులు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కింద వెనక్కు రప్పించి ఆయన్నూ అరెస్టు చేశారు. అదేరోజు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ డొమెస్టిక్‌ కార్గోలో రెండు బాక్సుల్లో ఉన్న రూ.16 కోట్ల విలువైన 1,194 బంగారం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.  

►ఎంఎంటీసీ సహా మూడు సంస్థల నుంచి ఖరీదు చేసిన బంగారాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు వీళ్లు అన్ని పత్రాలు సిద్ధం చేసేవాళ్లు. విమానాశ్రయం వర కు వెళ్లిన తర్వాత ఆ బంగారాన్ని దారి మళ్లించి డొమెస్టిక్‌ కార్గొ ద్వారా హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తూ వచ్చారని డీఆర్‌ఐ తేల్చింది. దీనికిపై ఈ ఏడాది మార్చిలో కోల్‌కతాకు చెందిన ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీళ్లు వివిధ దశల్లో రూ.100 కోట్ల విలువైన 250 కేజీల బంగారం దారి మళ్లించినట్లు తేల్చారు.  

►ఈ నేపథ్యంలోనే కోల్‌కతా ఈడీ అధికారులు నగర యూనిట్‌ సహకారంతో ఈ ఏడాది మార్చిలో ఘన్‌శ్యామ్‌దాస్‌ సంస్థతో పాటు శ్రీగణేష్‌ జ్యువెల్స్, పీహెచ్‌ జ్యువెల్స్‌ సంస్థలోదాడులు చేసి కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులోనే ఈడీ బుధవారం ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను మోసం చేసిన కేసులో సంజయ్‌కుమార్‌ అగర్వాల్‌ను 2012 ఫిబ్రవరిలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top