ఏకపక్ష వైఖరిని ఒప్పుకోం.. గోదావరి బోర్డు తీరును  ఆక్షేపిస్తూ తెలంగాణ లేఖ

Godavari River Management Board Acting Unilaterally Says Telangana Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రాజెక్టుల సందర్శన, ప్రాజెక్టుల అప్పగింత నోట్‌ రూపకల్పన ప్రక్రియల్లో గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) ఏకపక్షంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. జీఆర్‌ఎంబీ సబ్‌ కమిటీ సభ్యులెవరినీ ఇందులో భాగస్వాములుగా చేయకపోవడాన్ని తప్పుబట్టింది. సాధారణ ప్రక్రియకు విరుద్ధమైన ఈ వ్యవహార శైలిని అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ సోమవారం జీఆర్‌ఎంబీ బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. ప్రాజెక్టు సైట్ల సందర్శన, అప్పగింత నోట్‌ తయారీకి బోర్డు/సబ్‌ కమిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆ లేఖలో తెలిపింది.

బోర్డు/సబ్‌ కమిటీ నిర్ణయాల మేరకే బోర్డు అధికారులు పనిచేయాలని కోరింది. బోర్డు సచివాలయం అధికారులెవరు సందర్శనకు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని, బోర్డు అనుమతి లేకుండా సందర్శన జరిపే అధికారుల అభిప్రాయాలను ఏమాత్రం అంగీకరించబోమని తెలిపింది. కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగు మినహా తెలంగాణలోని ఇతర ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top