గ్రేటర్‌ హైదరాబాద్‌.. కలెక్టరే కింగ్‌!  | GHMC: Collector Have Powers Layout Permissions And Removal In Hyderabad | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ హైదరాబాద్‌.. కలెక్టరే కింగ్‌! 

Jul 28 2021 6:39 AM | Updated on Jul 28 2021 6:39 AM

GHMC: Collector Have Powers Layout Permissions And Removal In Hyderabad - Sakshi

లే అవుట్లకు అనుమతివ్వడం, అక్రమ లే అవుట్లను గుర్తించడం వంటి కీలక అధికారాలను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఇప్పటి వరకు ఈ అధికారాలు హెచ్‌ఎండీఏ, డీటీసీపీ(డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌)ల పరిధిలో ఉండేవి. రాజధానితో సహా చుట్టూరా ఏడు జిల్లాల్లో విస్తరించిన మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలో పట్టణ ప్రణాళికను పటిష్టం చేయాలని భావించిన ప్రభుత్వం..మాస్టర్‌ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నూతన లే అవుట్లకు అనుమతుల మంజూరు, అక్రమ లే అవుట్లను తొలగించే విషయంలో నియంత్రణ అధికారాలు చెలాయించిన హెచ్‌ఎండీఏ, డీటీసీపీలు..ఇక నుంచి మాస్టర్‌ప్లాన్‌ల తయారీ, పట్టణాల సమగ్ర సమాచార నిర్వహణ, డిజిటల్‌ డోర్‌ నెంబర్లను రూపొందించడం, జీఐఎస్‌ బేస్‌ మ్యాపుల తయారీ తదితర విధులను చేపట్టాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో ప్రధాన విధులను హెచ్‌ఎండీఏ, డీటీసీపీల పరిధి నుంచి మినహాయిస్తూ.. ఇక నుంచి లే అవుట్ల అనుమతుల మంజూరు, అక్రమ లే అవుట్లను తొలగించే అధికారాలను టీఎస్‌బీపాస్‌ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రత్యేక ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. 

ఇక రియల్‌ బూమ్‌కు రెక్కలే? 
రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి ఎటువైపు చూ సినా వంద కిలోమీటర్ల పరిధి వరకు రియల్‌బూమ్‌ అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో రియల్‌ రంగం ఏటేటా శరవేగంగా ముందుకు దూసుకెళుతోంది. అయితే నూతన లే అవుట్ల ఏర్పాటుకు సంబంధించి హెచ్‌ఎండీఏ, డీటీసీపీ విభాగాల నుంచి అనుమతులు సాధించడం రియల్టర్లకు, నిర్మాణ రంగ సంస్థలకు కత్తిమీద సాములానే పరిణమించింది. నెలలపాటు ఆయా విభాగాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా అనుమతుల మంజూరు ఆలస్యమయ్యేది. ఆయా విభాగాల అధికారులు సవాలక్ష కొర్రీలు పెడుతూ దరఖాస్తు దారుల సహనాన్ని పరీక్షించేవారు.  ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులతోపాటు..అధికారులకు లక్షల రూపాయలు ముడుపులు సమర్పించుకున్నా అనుమతులు పొందడం సాధ్యపడడం లేదని పలువురి నుంచి ప్రభుత్వ దృష్టికి భారీగా ఫిర్యాదులు అందాయి. దీంతో ఇక నుంచి కలెక్టర్లకు ఈ అధికారాలను అప్పజెప్పడంతో లే అవుట్ల ఏర్పాటుకు మార్గం సుగమం కానుందని, దీంతో  రియల్‌బూమ్‌కు మళ్లీ రెక్కలొచ్చే అవకాశాలుంటాయని రియల్టర్లు అభిప్రాయపడుతుండడం విశేషం.  
హెచ్‌ఎండీఏ, డీటీసీపీ విభాగాల నూతన విధులు ఇలా.. 
మాస్టర్‌ప్లాన్‌ల తయారీ 
 పట్టణ సమగ్ర సమాచార నిర్వహణ, డిజిటల్‌ డోర్‌ నెంబర్ల విధానాన్ని రూపొందించడం. 
 ల్యాండ్‌ యూజ్‌ ప్రణాళికలను మండలాలు, స్థానిక సంస్థల వారీగా రూపొందించడం. 
 ప్రజోపయోగ భవనాల డిజైన్లకు అనుమతుల మంజూరు, పార్కులు, ప్లే గ్రౌండ్స్, శ్మశానాలు, వెజ్, నాన్‌ వెజ్‌ మార్కెట్ల ఏర్పాటుకు సంబంధించి పట్టణ స్థానిక సంస్థలకు అనుమతుల మంజూరు. 
 ప్రాంతీయ ప్రణాళికలను రూపొందించడం. 
 డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ ఇక నుంచి హెచ్‌ఎండీఏకు ఆవల ల్యాండ్‌పూలింగ్‌ అంశానికి సంబంధించి సాంకేతిక అథారిటీగా వ్యవహరించనుంది. హెచ్‌ఎండీఏ పరిధిలో ఈ సంస్థనే ల్యాండ్‌పూలింగ్‌ అంశాన్ని పర్యవేక్షిస్తుంది. 
 ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, టౌన్‌ప్లానింగ్‌ ప్రణాళికలను రూపొందించాలి. 
 రహదారుల అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన,పట్టణ స్థానిక సంస్థల పరిధిలో రహదారుల విస్తరణ ప్రణాళికలు రూపొందించడం. 
 తమ పరిధిలోని వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిలను రూపొందించడం. 
 టీఎస్‌బీపాస్‌ అమలుపై ఆయా జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం, సలహాలు అందజేయడం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement