Hyderabad: ప్రజల విమర్శలతో కుక్కల బెడద నివారణకు చర్యలు.. విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు..

GHMC Action Plan For Stray Dogs Problem In Hyderabad - Sakshi

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా.. 

పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు 

‘డూస్‌’ అండ్‌ ‘డోంట్స్‌’తో కరపత్రాలు, పోస్టర్లు 

జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ 

తక్షణ పరిష్కారానికి తగిన యంత్రాంగం లేని బల్దియా  

ప్రజల విమర్శలతో కుక్కల బెడద నివారణకు చర్యలు 

సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడైనా సరే.. ప్రజల ప్రాణాలు పోయాక సదరు ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామనే జీహెచ్‌ఎంసీ.. కుక్కకాట్ల విషయంలోనూ అలాగే సిద్ధమైంది. ప్రజలకు కుక్కకాట్ల బెడద తగ్గించేందుకు ప్రభుత్వం ఆదేశించిన కార్యక్రమాల అమలుకు సిద్ధమైంది. యాక్షన్‌ స్టార్ట్‌ చేయడంతో పాటు పబ్లిసిటీపైనా శ్రద్ధ చూపుతోంది.

కుక్కలు మనుషుల జోలికి రాకుండా ఉండేందుకు ఎలా వ్యవహరించాలి? అనే అంశంపై పాఠశాలల్లోని విద్యార్థులకు వివరించడంతో పాటు కుక్కల విషయంలో చేయాల్సినవి, చేయకూడనివి (డూస్‌ అండ్‌ డోంట్స్‌) పనులను వివరిస్తూ పాఠశాలల్లో పోస్టర్లును ప్రదర్శిస్తోంది. కరపత్రాల పంపిణీ ప్రారంభించింది. వీటితోపాటు కుక్కల సంతతి నిరోధానికి ఆపరేషన్లు, రేబిస్‌ సోకకుండా వ్యాక్సిన్లు వేసే చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.  

ప్రతియేటా కుక్కల గణన 
వీటితోపాటు ప్రతియేటా కుక్కల గణన చేపట్టాలని  నిర్ణయించింది. వీధికుక్కలకు సంబంధించిన ఫిర్యాదులందగానే  తక్షణ చర్యలు చేపట్టాలని, కుక్కల సంరక్షణ కేంద్రాలకు తరలించే కుక్కలకు వ్యాధులుంటే  చికిత్సలు చేయడంతోపాటు   ఆహార సమస్యలు తలెత్తకుండా చూడాలని నిర్ణయించింది.విద్యార్థులతో పాటు   రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు,   స్వయం సహాయక సంఘాలు, స్లమ్‌ ఫెడరేషన్‌ సభ్యులకు  సైతం కుక్కలకు సంబంధించి తగిన  అవగాహన కలి్పంచ నున్నారు.

కుక్కలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. మాంసం,  ఇతరత్రా ఆహార వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మూసీ ప్రాంతాల్లో నూరుశాతం వీధికుక్కలను పట్టుకునేందుకు స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొంది.  కుక్క కాటు నివారణకు స్వచ్ఛంద సంస్థలు , జంతు ప్రేమికులు, ప్రజాప్రతినిధులు  తగిన సహకారం అందించాల్సిందిగా కోరింది.  

సామర్థ్యం లేని బల్దియా..  
వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా.. వాటిని పరిష్కరించేందుకు తగిన యంత్రాంగం బల్దియాలో లేదు. వచి్చన ఫిర్యాదులకు అనుగుణంగా వీధి కుక్కలను పట్టుకునేందుకు తగిన వాహనాలు, నిపుణులైన సిబ్బంది గానీ లేరు. ఫిర్యాదుల్లో ఒకే ప్రాంతం సమస్యను ఎక్కువ సార్లు ఫోన్‌ చేసి చెప్పడంతో అధిక సంఖ్యలో ఫిర్యాదులు కనిపిస్తున్నాయని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. 

ఫిర్యాదుల వరద..
అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు కుక్కలదాడిలో మృతి చెందడంతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో, టీవీల్లో దాడి దృశ్యాలు చూసిన వారు బయటకు వెళ్లే తమ పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారు. జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌కు నాలుగు రోజులుగా నిత్యం రెండు వేలకు పైగా ఫిర్యాదులు అందాయి. నాలుగు రోజుల్లో పదివేలకు పైగా ఫిర్యాదు వచ్చాయి.  
వివరాలిలా ఉన్నాయి.  

జీహెచ్‌ఎంసీ ముద్రించిన పోస్టర్లలో దిగువ అంశాలు పేర్కొన్నారు
చేయాల్సినవి.. 
♦ కుక్క మీ దగ్గరకు వస్తుంటే.. కదలకుండా అక్కడే నిలబడాలి. 
♦ వీధి కుక్కలకు దూరంగా ఉండాలి. 
♦ నిశ్శబ్దంగా ఉండాలి.  
♦ పిల్లలతో ఉన్న కుక్కల దగ్గరకు వెళ్లొద్దు.  
♦ కుక్కలతో స్నేహపూర్వకంగా ఉండాలి.. కానీ వాటిని ముట్టుకోవద్దు. 
♦ కుక్కల గుంపు కనిపిస్తే వాటికి దూరంగా ఉండాలి. 

చేయకూడనివి.. 
♦ కుక్కలు అరుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు వాటికి భంగం కలిగించొద్దు.  
♦ వీధికుక్కలపై రాళ్లు విసరడం వంటివి చేయొద్దు. 
♦ తల్లి, పిల్లలు ఉన్నప్పుడు కుక్కల వద్దకు వెళ్లొద్దు.  
♦ కుక్కల వెంటపడి తరమడం చేయవద్దు. 
♦ కుక్కల తోక, చెవులు లాగడం వంటి పనులు చేయవద్దు. 
♦ రోడ్లపై మాంసాహారం వేయవద్దు.  

ఎప్పుడైనా కుక్క కరిస్తే కరిచిన ప్రాంతంలో సబ్బుతో శుభ్రం చేసి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 
జీహెచ్‌ఎంసీని సంప్రదించాల్సిన  ఫోన్‌ నంబర్‌: 040 21111111
చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి..

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top