హలీమ్ ప్రియుల‌కు గుడ్‌న్యూస్‌ | FSSAI sets new standards for Hyderabadi Haleem, Full details | Sakshi
Sakshi News home page

హలీమ్‌ తయారీలో ప్రమాణాలు ఖరారు

May 15 2026 2:16 PM | Updated on May 15 2026 2:22 PM

FSSAI sets new standards for Hyderabadi Haleem, Full details

మటన్‌ నుంచి ప్రొటీన్‌ దాకా తగిన పాళ్లలో ఉండాల్సిందే

ఎగుమతిదారుల ఫిర్యాదులతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్ణయం

సాక్షి, హైద‌రాబాద్‌: డబ్బాలో పెట్టి  కేఫ్‌/షాప్‌ల వాళ్లు అందిస్తున్న హలీమ్‌ ఎలాంటిది? ఏ దినుసులు ఎంత శాతం చొప్పున కలుపుతున్నారు? అది ఎంత మేర ఆరోగ్యకరం? ఇప్పటిదాకా తెలియని ఈ కచ్చితమైన వివరాలు హలీమ్‌ ప్రియులకు తెలియనున్నాయి. గోధుమలు, పప్పు లు సహా ఏవేవో కలిపేసి హలీమ్‌ తయారీ చేసే అక్రమ వ్యాపారుల ఆగడాలకు కళ్లెం పడనుంది.  

హైదరాబాద్‌ హలీమ్‌ (Hyderabad Haleem) ఎంతో పాపులర్‌. కాగా అంతర్జాతీయంగా ఎగుమతి అయ్యే ఏ ఆహారోత్పత్తికైనా నిర్దుష్ట ప్రమాణాలు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే కొందరు ఎగుమతిదారుల ఆరోపణల దృష్ట్యా హలీమ్‌ నాణ్యత ఖరారు చేయాలని, నగర సంస్కృతికి పర్యాయపదంగా నిలిచిన  ప్రఖ్యాత వంటకాన్ని ప్రామాణీకరించాలని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిర్ణయించింది. నిర్దుష్ట ప్రమాణాలను రూపొందించింది. గత ఏప్రిల్‌ 28న నవీకరణను జారీ చేసింది. ప్రమాణాలను పాటించాల్సిన గడువును పొడిగిస్తూ నవంబర్‌ 1గా నిర్ణయించింది.

ప్రమాణాలు ఏమిటి? 
మాంసం, ప్రోటీన్‌ తేమ అవసరాలతో సహా కఠిన ప్రమాణాలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రవేశపెట్టింది. హలీమ్‌ను ‘సాధారణ ఆహారం’ వర్గం నుంచి ఒక ప్రత్యేక విభాగానికి మార్చి కచ్చితంగా ఏమేం ఉండాలో తేల్చింది.  

ఇకపై చట్టబద్ధంగా ’హలీమ్‌’ అని పేర్కొనాలన్నా, అధికారముద్ర పడాలన్నా..  ఆ ఆహార ఉత్పత్తిలో ఇప్పుడు బరువు ప్రకారం కనీసం 25 శాతం మటన్‌ /చికెన్‌ ఉండాలి. ఖర్చులను తగ్గించుకోవడానికి గోధుమ కంకులు, పప్పులు నీళ్లు  కలిపిన హలీమ్స్‌ను వండి వడ్డించే కొన్ని హలీమ్‌ స్టాల్స్‌ ఆటలు ఇక చెల్లవు.

ప్యాక్‌ చేసి ఎగుమతి చేసే ప్రతి హలీమ్‌ తప్పనిసరిగా పాటించాల్సిన నిర్దిష్ట రసాయన ప్రమాణాలను కూడా నిబంధనలు నిర్దేశించాయి. మటన్‌ హలీమ్‌లో కనీసం 8 శాతం ప్రోటీన్, 70 శాతం తేమ ఉండాలి. చికెన్‌ హలీమ్‌లో (Chicken Haleem) కనీసం 6 శాతం ప్రోటీన్, 75 శాతం తేమ పరిమితిని నిర్దేశించారు. నిర్ణీత ప్రోటీన్, తేమ శాతాలు ఇప్పుడు హలీమ్‌ నాణ్యతను నిర్ధారించే ప్రయోగశాల పరీక్షల సమయంలో పారామితులుగా పనిచేస్తాయి.

చ‌ద‌వండి: భ‌ర్త డైరెక్ష‌న్‌.. భార్య యాక్ష‌న్‌

హలీమ్‌లలో కొవ్వు 12 శాతానికి పరిమితం కావాలి. వచ్చే రంజాన్‌ నాటికి, ప్రతి వాణిజ్య తయారీదారు ఈ ప్రోటీన్‌ కొవ్వు శాతాలను తమ లేబుళ్లపై చట్టబద్ధంగా ముద్రించాల్సి ఉంటుంది. మటన్, బఫెలో మీట్‌ హలీమ్‌ల మధ్య తేడాను లేబుళ్లపై స్పష్టంగా పేర్కొనాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement